కో పైలట్ వల్లనే ప్రమాదమా! | French co-pilot flying AirAsia jet before crash-investigators | Sakshi
Sakshi News home page

కో పైలట్ వల్లనే ప్రమాదమా!

Published Thu, Jan 29 2015 1:47 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

కో పైలట్ వల్లనే ప్రమాదమా!

కో పైలట్ వల్లనే ప్రమాదమా!

ఇండోనేషియాలోని జావా సముద్రంలో గత నెల కూలిపోయిన ఎయిర్ ఆసియా విమాన ప్రమాదం కారణాలపై చిక్కుముడి ఇప్పుడిప్పుడే వీడిపోతోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానాన్ని కెప్టెన్ పైలట్ కాకుండా అంతగా అనుభవంలేని కో పైలట్ నడుపుతున్నాడని తేలిందని ఇండోనేషియా జాతీయ రవాణా భద్రతా కమిటీ తన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో వెల్లడించింది. గత డిసెంబర్ 28వ తేదీన జరిగిన ఈ విమాన ప్రమాదంలో 162 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పటివరకు 70 మంది మృతదేహాలు మాత్రమే దొరికాయి.  

ఎయిర్ ఆసియాకు చెందిన క్యూజెడ్8501 విమానం ప్రమాదం జరిగిన సమయంలో గగనతలంలో 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోందని, అది హఠాత్తుగా 37, 400 అడుగుల ఎత్తుకు దూసుకెళ్లడమే కాకుండా అంతే వేగంతో హఠాత్తుగా 24 వేల అడుగుల దిగువకు పడిపోయిందని కమిటీలో దర్యాప్తు అధికారిగా ఉన్న సీనియర్ పైలెట్ ఎర్తాట లానంగ్ గురువారం నాడు ఇక్కడ వెల్లడించారు. 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని 38 వేల అడుగులకు తీసుకెళ్లడానికి విమానం పైలట్, గ్రౌండ్ కంట్రోల్ అనుమతి కోరారని, అయితే 34 వేల అడుగుల ఎత్తుకు తీసుకె ళ్లడానికి మాత్రమే గ్రౌండ్ కంట్రోల్ అనుమతించిదని ఆయన చెప్పారు.

దీన్ని లెక్క చేయకుండా విమానాన్ని 37, 400 అడుగులకు తీసుకెళ్లారని, అది పైకి  దూసుకుపోతున్నప్పుడు ఏటవాలుగా ఎడమ వైపుకు ఒరిగి పోవడమే కాకుండా వణుకుతున్నట్టు రేడార్‌లో కనిపించిందని ఆయన వివరించారు. విమానం 24 వేల అడుగులకు హఠాత్తుగా పడిపోయిన తర్వాత రేడార్  స్క్రీన్ నుంచి అద్యశ్యమైందని, ఆ తర్వాత సముద్రంలో కూలిపోయిందని ఆయన తెలిపారు. అసలు ఉరుములు, మెరుపులు ఎక్కువగా వున్న ప్రాంతంలోకి విమానం ఎందుకు దూసుకెళ్లిందో తమకు అంతుచిక్కడం లేదని, ఈ అంశంపై ఇంకా లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని దర్యాప్తు కమిటీలోని ఇతర సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement