పారిస్ : కరోనా కష్టకాలంలో అహర్నిశలు కష్టపడుతున్న తమ సమస్యలను తీర్చాలని నిరసనకు దిగిన వైద్య సిబ్బందికి పారిస్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. నిరసనకు దిగిన 50 మంది వైద్య సిబ్బందికి జరిమానా విధించగా, ముగ్గురిని అరెస్ట్ చేశారు.
కరోనావైరస్ వ్యాప్తికి ముందు నుంచే పారిస్‌లోని రాబర్ట్ డెబ్రే ఆసుపత్రి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఇక కరోనా వ్యాప్తితో అక్కడి సిబ్బందిపై పనిభారం పెరిగింది. దీనికి తోడూ వేతనాల్లో కత్తెర, వైద్య పరికరాల కొరత వంటి సమస్యలతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దాదాపు 400 మంది వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బంది నిరసనకు దిగారు. ఆసుపత్రికి మెరుగైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ర్యాలీ తీశారు. అయితే నిరసనకారులు సామాజిక దూరం విషయంలో నియమాలను ఉల్లంఘించారని పారిస్ పోలీసులు తెలిపారు. అక్కడున్నవారిని చెదరగొట్టడానికి ప్రయత్నించగా, అందుకు తిరస్కరించిన వారికి అక్కడే 150 డాలర్ల జరిమానా విధించారు. జరిమానా కట్టని ముగ్గురిని అరెస్ట్ చేశారు. వేతనాల పెంపుతోపాటూ, కార్మికుల ఆరోగ్య సంరక్షణకు మెరుగైన వసతులను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారితో వైద్య సిబ్బందిపై పనిభారం అధికమైందని నిరసనల్లో పాల్గొన్న వైద్యులు తెలిపారు. అంతేకాకుండా సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో తమకు కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మే ప్రారంభం నుంచే ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ వస్తోంది. కొన్ని విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. షాపులు, పాఠశాలలను కూడా తెరిచేందుకు అవకాశం ఇచ్చింది. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన నిబంధనల విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment