
అబ్బురపరచిన త్రివిధ దళాలు
సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకూ యోగా ఈవెంట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా డే త్రివిధ దళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రపంచంలోనే ఎత్తై యుద్ధభూమి సియాచిన్ గ్లేసియర్ మొదలుకుని దక్షిణ చైనా సముద్రం వరకూ భారత బలగాలు యోగాసనాలు వేసి ఆకట్టుకున్నాయి. ఆదివారం ఢిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం మెగా ఈవెంట్‌లో ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్, ఎయిర్‌చీఫ్ మార్షల్ అరూప్ రాహా, నేవీ అడ్మిరల్ ఆర్‌కే ధోవన్ పాలుపంచుకున్నారు.
ఇక రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మీరట్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే దేశంలో యోగా డేకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది మాత్రం సైనిక దళాలే. మంచు దుప్పటి కప్పుకున్న సియాచిన్‌లో సముద్ర మట్టానికి 18,800 అడుగుల ఎత్తులో యోగాసనాలు వేసి అందరినీ అబ్బురపరిచారు. చలిని తట్టుకునే ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఉదయం మైనస్ 4 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైనికులు యోగా చేశారు.
కార్గిల్, లడఖ్‌తో పాటు దేశంలోని అన్నిఆర్మీ యూనిట్లలోనూ కార్యక్రమాలు నిర్వహించారు. నేవీ కూడా వేడుకల్లో పాలుపంచుకుంది. దక్షిణ చైనా సముద్రంలోని భారత నేవీ నౌకల్లో యోగాసనాలు వేశారు. వాయు సేన కూడా యోగా సెషన్లు నిర్వహించింది.