ఆట నేర్పే బంతి
మీరు ఫుట్‌బాల్ నేర్చుకోవాలనుకుంటున్నారా? కోచ్ ఎవరూ లేరని బాధపడుతున్నారా? అయితే ఫొటోలో కనిపిస్తున్న బంతి మీ కోసమే! ఈ హైటెక్ బంతిలోనే ఓ కోచ్ ఉన్నాడు. బంతిలో రకరకాల సెన్సర్లు అమర్చారు. మీరు బంతిని తన్నినప్పుడు ఎంత గట్టిగా తన్నారు? ఎంత మేరకు బంతి గిరగిరా తిరుగుతోంది?, బంతి ఎంత దూరం వెళ్లింది? ఏ మార్గంలో వెళ్లింది? ఇలాంటి అన్ని వివరాలను ఈ సెన్సర్లు నమోదు చేసుకుంటాయి.
వైఫై ద్వారా సమాచారాన్ని విశ్లేషించే ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ .. హెడ్‌ఫోన్ ద్వారా మీకు సూచనలిస్తుంది. ‘‘భలే కొట్టావు, బంతిని కుడివైపునకు తీసుకెళ్లు, సిసర్ కిక్ కొట్టు’’ అంటూ రకరకాల సూచనలు అందివ్వగలదు. వీటితోపాటు అప్లికేషన్‌లో పది షార్ట్ వీడియో కోచింగ్ మెటీరియల్‌ను పెట్టామని కంపెనీ చెబుతోంది. బాల క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌లు అనేక మందితో మాట్లాడాక మూడేళ్లు శ్రమపడి తాము ఈ ఇన్‌సైడ్ కోచ్ బంతిని అభివృద్ది చేశామని తెలిపింది. ఈ సంవత్సరం చివరినాటికి ఈ అధునాతన బంతి మార్కెట్‌లోకి రానుంది.