
పంచ్ ఇవ్వడానికెళితే తల్వార్‌తో తరిమాడు
మాంచెస్టర్: తనపై దాడి చేసేందుకు వచ్చిన కొంతమంది యువకులకు ఆ కారు డ్రైవర్ ఝలక్ ఇచ్చాడు. అతడు ఇచ్చిన షాక్‌కు అక్కడి యువకులు ఓ మై గాడ్ అంటూ పారిపోవడమే మాత్రమే కాక ఇప్పుడు పోలీసులు కూడా తీవ్ర ఆలోచనలో పడ్డారు. అసలు ఆ డ్రైవర్ ఎందుకు అలా చేశాడని శోదిస్తున్నారు. ఇంతకీ అసలు ఆ డ్రైవర్ ఇచ్చిన షాకేమిటి? గొడవెందుకైంది? ఈ ఘటన ఎప్పుడు ఎలా జరిగిందని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. సౌత్ మాంచెస్టర్‌లోని కార్ల్‌టన్ లో ప్యూగాట్ కారులో వెళుతున్న ఓ వ్యక్తితో రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ యువకుడు గొడవపడ్డాడు.
అనంతరం ఆరుగురి గ్యాంగ్‌ను వేసుకొని ఆ కారుపై డ్రైవర్‌పై దాడి చేసేందుకు దగ్గరకు వెళ్లాడు. దీంతో తొలుత ఆ డ్రైవర్ కారును వేగంగా ముందుకుపోనిచ్చి మళ్లీ స్లో చేశాడు. దీంతో ఆ యువకులు తిరిగి అతడి వద్దకు పరుగెత్తారు. అతడికి పంచ్ ఇద్దామని పిడికిలి బిగించగానే కారులో ఉన్న వ్యక్తి అనూహ్యంగా షాకిచ్చాడు. తన కారు అద్దాన్ని కిందకు దించి అందులో నుంచి పెద్ద కత్తిని బయటకు తీసి అందులో ఉండే దాన్ని ఊపెయ్యడం మొదలుపెట్టాడు.
అంతే కొట్టేందుకు వచ్చిన యువకుడు అయ్యబాబోయ్ అని పరుగెత్తగా ఆ వీడియో సీసీటీవీ కెమెరాతోపాటు పలువురి ఫోన్లలో రికార్డయ్యి బయటకొచ్చింది. అది చూసిన పోలీసులు ఒక డ్రైవర్ అలా కారులో అంతపెద్ద కత్తి పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముందని యోచిస్తున్నారు. అతడిని పిలిచి విచారించే ప్రయత్నం చేస్తున్నారు.