బెర్లిన్: కరోనా దెబ్బకు అన్ని దేశాలు విలవిలలాడుతున్న వేళ జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత కరోనా వైరస్ రూపంలో జర్మనీ అతిపెద్ద సవాలును ఎదుర్కొంటుందని మెర్కెల్ ఓ టీవీషోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మెర్కెల్ మాట్లాడుతూ.. కరోనా రాకుండా దేశ పౌరులు పరిశుభ్రత పాటించాలని కోరారు. ప్రజలందరు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే కరోనాను విజయవంతంగా జయించవచ్చని తెలిపారు.
ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని, కరచాలనం చేసుకోకుండా కేవలం కళ్ల ద్వారా మాత్రమే పలకరించుకోవాలని ఆమె ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో పౌరులకుండే ప్రయాణ హక్కును కాదనడం భావ్యం కాదని.. కానీ ఈ చర్యలన్ని పౌరులను కాపాడడం కోసమేనని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెర్కెల్ భరోసా కల్పించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నివారించేందుకు అన్ని దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా 15 ఏళ్లు పదవిలో ఉన్న మెర్కెల్ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నారు. 2015లో శరణార్థుల సమస్య, బ్రెగ్జిట్, ఆర్థిక మందగమనం వంటి ఎన్ని సంక్షోభాలు ఎదురయినా ఆమె ఏనాడు ప్రజలకు నేరుగా సూచనలు ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment