Germany - China COVID 19 War: చైనాకు భారీ బిల్లు పంపిన జర్మనీ! - Sakshi Telugu
Sakshi News home page

కరోనా: చైనాకు భారీ బిల్లు పంపిన జర్మనీ!

Published Mon, Apr 20 2020 1:19 PM | Last Updated on Mon, Apr 20 2020 2:18 PM

Germany Sends China Bill Over Covid 19 Cause Economic Damage - Sakshi

బెర్లిన్‌: కరోనా వైరస్‌(కోవిడ్‌-19) రోజురోజుకీ ప్రమాదకరంగా పరిణమిస్తున్న తరుణంలో.. మహమ్మారి పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనాపై ప్రపంచదేశాల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి విలవిల్లాడిపోతోంది. ఇప్పటికే 40 వేల మందికి పైగా ఈ వైరస్‌ సోకి మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది దీని కోరల్లో చిక్కుకున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే చైనాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

‘చైనీస్‌ వైరస్‌’ను ఉద్దేశపూర్వకంగానే ప్రపంచం మీదకు వదిలారని తమ విచారణలో తేలితే డ్రాగన్‌ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక అమెరికా మీడియా సైతం వుహాన్‌ నగరంలో ఉన్న వైరాలజీ సంస్థ నుంచి కరోనా లీకైందంటూ కథనాలు వెలువరిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో పాటు యునైటెడ్‌ కింగ్‌డం, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా వైరస్‌ పుట్టుక, వ్యాప్తికి చైనానే కారణమని.. ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా జర్మనీ సైతం ఈ జాబితాలో చేరింది.(ఆ దేశాల కంటే మేమే ముందున్నాం: ట్రంప్‌)

కరోనాకు జన్మస్థానమైన చైనా.. ఆ వైరస్‌ కారణంగా తమకు వాటిల్లిన నష్టాన్ని పూడ్చాల్సిందిగా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు 130 బిలియన్ల బ్రిటీష్‌ పౌండ్లు చెల్లించాలంటూ ఇన్‌వాయిస్‌ పంపింది. తద్వారా టూరిజం ఆదాయంలో చవిచూసిన 27 బిలియన్‌ యూరోల నష్టం, సినిమా పరిశ్రమకు వాటిల్లిన 7.2 బిలియన్‌ యూరోల నష్టం, జర్మన్‌ ఎయిర్‌ లైన్స్‌, ఇతర వ్యాపారకలాపాల నిలిపివేత వల్ల కోల్పోయిన 50 బిలియన్‌ యూరోలను తమకు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. జర్మనీ వార్తా పత్రిక బిల్డ్‌ ఈ మేరకు కథనం వెలువరించింది. ఆర్థిక నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత చైనాదేనని పేర్కొంది. ఇందుకు స్పందించిన చైనా.. ‘‘జాతీయవాదం, జినోఫోబియా(విదేశాలపై వ్యతిరేకత)ను రెచ్చగొట్టడమే ఇది’’అని ఆగ్రహం వ్యక్తం చేసింది.(వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా లీకైంది...)

ఇక ఈ విషయం గురించి బిల్డ్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ మాట్లాడుతూ... ‘‘ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని చైనా పూడుస్తుందా అని మేం మా పత్రికాముఖంగా అడిగాం. జిన్‌పింగ్‌, ఆయన ప్రభుత్వం, శాస్త్రవేత్తలు కరోనా గురించి ముందే తెలిసినా ప్రపంచానికి చెప్పలేదు. పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు వైరస్‌ గురించి అడుగుతున్న ప్రశ్నలకు మీ వద్ద సమాధానం లేదు. నిజం చెప్పేందుకు మీ జాతీయవాదం అడ్డువచ్చింది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు’’అని చైనా తీరును విమర్శించారు. కాగా కరోనా వైరస్‌ను సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ చైనాపై 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ వాషింగ్టన్‌కు చెందిన న్యాయవాది లారీ క్లేమన్‌ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement