బెర్లిన్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) పుట్టుక, వ్యాప్తి తదితర అంశాల్లో పారదర్శకత ప్రదర్శించాలని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ చైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా మహమ్మారి వల్ల తలెత్తిన సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గాలు అన్వేషించవచ్చని అభిప్రాయపడ్డారు. చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 25 లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా... లక్షా డెబ్బై వేల మరణాలు సంభవించాయి. అగ్రరాజ్యం అమెరికా సహా ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, ఇరాన్, జర్మనీ తదితర దేశాలు ఈ మహమ్మారి ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి.(కరోనా: చైనాకు భారీ బిల్లు పంపిన జర్మనీ!)
ఈ నేపథ్యంలో విపత్కర పరిస్థితులకు డ్రాగన్ దేశమే కారణమంటూ ప్రపంచ దేశాలు దుమ్మెతిపోస్తున్నాయి. ఇక వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా లీకైందంటూ కథనాలు వెలువడుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడికి తమ శాస్త్రవేత్తల బృందాన్ని పంపిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం ఏంజెలా మెర్కెల్ మాట్లాడుతూ... ‘‘వైరస్ పుట్టుక గురించి చైనా మరింత పారదర్శంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నా. వారు వెల్లడించే వివరాల ఆధారంగా కరోనా ఎదుర్కోవడం ఎలాగో ప్రపంచం తెలుసుకుంటుంది. కరోనా గురించి మరింత సమాచారం ఇవ్వండి’’ అని విజ్ఞప్తి చేశారు.(అమెరికా విచారణకు చైనా నో!)
మేం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం: చైనా
ఇక ప్రపంచ దేశాల విమర్శలపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్... వుహాన్ నగరంలో వైరస్ ఆనవాళ్లను గుర్తించిన నాటి నుంచి నేటి దాకా చైనా అన్ని విషయాలను పారదర్శకంగా వెల్లడిస్తూ.. అంతర్జాతీయ సమాజానికి విలువైన సమాచారం ఇస్తోందన్నారు. తాము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటే కొంత మంది తమ దేశంపై దావా వేయాలనడం అర్థం లేని విషయమమని కొట్టిపారేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరుగలేదన్నారు. కాగా కరోనా వైరస్‌ను సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ చైనాపై 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ వాషింగ్టన్‌కు చెందిన న్యాయవాది లారీ క్లేమన్ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా జర్మనీ సైతం.. వైరస్ కారణంగా కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు 130 బిలియన్ల బ్రిటీష్ పౌండ్లు చెల్లించాలంటూ ఇన్‌వాయిస్ పంపినట్లు ఆ దేశ పత్రిక బిల్డ్ ఓ కథనం వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment