ఫేస్బుక్ వివాదం.. 65 కత్తిపోట్లతో స్నేహితురాలి హత్య
లండన్: ఫేస్బుక్ వివాదం అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరి స్నేహితుల జీవితాల్లో చిచ్చు పెట్టింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన ద్వేషం హత్యకు దారితీసి చివరకు విషాదాన్ని మిగిల్చింది. అంతకుముందు వరకు కలసిమెలసి తిరిగిన స్నేహితురాలిని మరో ఫ్రెండ్ ఏకంగా 65 సార్లు కత్తితో పొడించి చంపేసింది. ఇద్దరి వయసు దాదాపు 16 ఏళ్లే. ఈ విషాదకర సంఘటన మెక్సికోలో జరిగింది.
ఎరాండీ ఎలిజబెత్, అనెల్ బేజ్ ఇద్దరూ స్నేహితులు.కాగా అనెల్ ఇద్దరి నగ్న ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. ఈ విషయం ఎలిజబెత్కు తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. 'నేను ప్రశాంతంగా ఉన్నానని అనుకుంటున్నావు. నా దృష్టిలో నిన్ను మూడు సార్లు హత్య చేశాను' అంటూ ఎలిజబెత్.. అనెల్ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. అయినా అనెల్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. ఓ రోజు ఎలిజబెత్ను అనెల్ తన ఇంటికి ఆహ్వానించింది. ఆ సమయంలో ఇంట్లో ఇద్దరే ఉన్నారు. స్నేహితురాలిపై విద్వేషం పెంచుకున్న ఎలిజబెత్ కత్తితో తీసుకుని ఆమె వీపు భాగంగాపై విచక్షణ రహితంగా పొడిచింది. అనెల్ అక్కడికక్కడే మరణించింది. ఎలిజబెత్ తన దుస్తులు, కత్తిపై రక్తపు మరకలను కడిగేసి సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితురాలిని అరెస్ట్ చేశారు.