
థాయ్‌లాండ్: కేవలం ఒక్క అంతస్తు పైనుంచి పడి మరణించిన వారిని చూసుంటాం. మరి 11 అంతస్తు నుంచి పడితే... బతికే చాన్సే లేదు. కానీ థాయ్‌లాండ్‌లో ఓ చిన్నారి 11వ అంతస్తు నుంచి కిందపడినా కూడా ప్రాణాలతో బయటపడి మృత్యుంజయురాలిగా నిలిచింది. వివరాల్లోకెళ్తే... వ్యక్తిగత పనిపై దీచా సూక్పలం అనే వ్యక్తి తన కుమార్తెతో కలిసి థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణానికి వెళ్లాడు. వీరిద్దరూ అక్కడే ఓ హోటల్‌లో బస చేశారు. నిద్రలో నడిచే అలవాటున్న దీచా కుమార్తె రాత్రి గది నుంచి బయటకు వచ్చింది. తర్వాత వేరే గదిలోకి వెళ్లడానికి ప్రయత్నించిన ఆ చిన్నారి నేరుగా బాల్కానీ వైపు వెళ్లి గోడపైకి ఎక్కి వేలాడింది. కాసేపు గోడపై వేలాడిన చిన్నారి పట్టు తప్పడంతో 11వ అంతస్తు నుంచి పడిపోయింది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇదంతా హోటల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. చిన్నారి కిందపడిపోతూ గట్టిగా కేకలు పెట్టింది. హోటల్ సిబ్బంది వచ్చి చూసేసరికి ఆ చిన్నారి కింద పడిపోయి స్పృహతప్పింది. వెంటనే ఆమెను బ్యాంకాక్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ప్రాణహాని లేదని.. గాయాల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.