92 ఏళ్ల బామ్మ మారథాన్ రికార్డ్
శాన్ డియాగో: పర్వంలో ఉన్నవాళ్లే పట్టుమని పది మైళ్లు పరుగెత్తాలంటే ఆపసోపాలు పడతారు. అటువంటిది... అమెరికాకు చెందిన 92 ఏళ్ల, 65 రోజుల వయస్సు మీద పడిన బామ్మ ఏకంగా 26 మైళ్ల మారథాన్‌ను ఆదివారం నాడు పూర్తిచేసి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన వృద్ధ మహిళగా సరికొత్త చరిత్రను సృష్టించారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిర్వహించిన ఈ మారథాన్‌ను వీక్షకుల కరతాళ ధ్వనులు, కేరింతల మధ్య ఏడు గంటల, 24 నిమిషాల, 36 సెకండ్లలో చెక్కు చెదరని నవ్వుతో పూర్తిచేసి యువతకే స్ఫూర్తిగా నిలిచిందీ బామ్మ. విజయవంతంగా మారథాన్‌ను పూర్తిచేశాక, అలసట ఏమోగానీ కాస్త నరాలు బిగుసుకుపోయినట్టు అనిపించిందని స్థానిక మీడియాకు తెలియజేసింది హరియెట్టి థామ్సన్ అనే ఈ బామ్మ. ‘వాస్తవానికి చిన్న పర్వత ప్రాంతాన్ని ఎక్కుతున్నప్పుడు 21వ మైలు వద్ద అలసిపోయాను. ఈ వయస్సులో నాను ఇదేమి క్రేజీ అని కూడా అనుకున్నాను.
ఈ పర్వతం నుంచి దిగుతున్నప్పుడు మాత్రం కాస్త ఉత్సాహంగానే అనిపించింది. ఎప్పటికప్పుడు అలసటను అధిగమించి శక్తిని కూడదీసుకునేందుకు నా కుమారుడు బ్రెన్నీ కార్బోహైడ్రేట్స్ ఇస్తూ ప్రోత్సహిస్తూ వచ్చాడు’ అని బామ్మ ముసిముసిగా చెప్పంది. మొత్తం 26 మైళ్ల మారథాన్‌లో మొదటి నుంచి చివరి వరకు బామ్మ కుమారుడు బ్రెన్నీ ఆమె వెన్నంటే మారథాన్ చేస్తూ వచ్చారు. ఈ బామ్మకన్నా ముందుకూడా ప్రపంచంలో అతివృద్ధ మహిళగా మారథాన్‌ను పూర్తిచేసిన రికార్డు కూడా ఓ అమెరికా బామ్మ పేరిటే ఉంది. ‘గ్లాడియోటర్’గా ముద్రపడిన గ్లేడిస్ బర్రిల్ అనే బామ్మ తన 92 ఏళ్ల, 19 రోజుల ప్రాయంలో 2010, హొనలులులో జరిగిన మారథాన్‌ను పూర్తిచేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును థామ్సన్ బామ్మ తిరగరాశారు. కేన్సర్‌పై పోరాటం చేసి స్వయంగా ఆ వ్యాధి బారి నుంచి బయట పడిన ఈ బామ్మ కేన్సర్‌పై పరిశోధనల కోసం నిధుల సేకరణ నిమిత్తం ఈ మారథాన్‌లో పాల్గొంది.