funds collect
-
రూ.301 కోట్లపైనే.. టీఆర్ఎస్ ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి రూ.301.47 కోట్ల ఆస్తులు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి నివేదిక సమర్పించింది. తమ పార్టీ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన 2019–20 ఆడిట్ నివేదికను గత ఫిబ్రవరి 15న టీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలకు సంబంధించిన వార్షిక నివేదికను సీఈసీ ఇటీవల తన వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. 2018–19లో రూ.188.73 కోట్లుగా ఉన్న టీఆర్ఎస్ నిధులు, ఆస్తు ల విలువ ఏడాది కాలంలో రూ.301.47 కోట్లకు చేరింది. ఇందులో జనరల్ ఫండ్ రూపంలో రూ.292.30 కోట్లు, కార్పస్ ఫండ్ రూపంలో రూ.4.76 కోట్లు, ఇతర రూపంలో రూ.4.41 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. పార్టీ పేరిట ఉన్న భవనాలు, వస్తు సామగ్రి విలువ రూ.21.27 కోట్లుగా ఉందని పార్టీ వెల్లడించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జిల్లా కార్యాలయాల స్థలం, భూముల విలువ సుమారు రూ.16.50 కోట్లుగా ఉంటుందని లెక్కలు వేసింది. 2019–20లో స్థిరాస్తుల కొనుగోలు, షెడ్యూలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ తదితరాల రూపంలో రూ.101 కోట్లు సమకూరాయి. పార్టీ విరాళాలు రూ. 89.55 కోట్లు 2019–20 ఆర్ధిక సంవత్సరంలో టీఆర్ఎస్కు వి విధ మార్గాల్లో రూ.130.46 కోట్లు సమకూరగా, అందులో విరాళాల రూపంలో అత్యధికంగా రూ. 89.55 కోట్లు అందాయి. పార్టీ సభ్యత్వ నమోదు, పార్లమెంటరీ, లెజిస్లేటివ్ పార్టీ, టీఆర్ఎస్వీ విభాగాల నుంచి కలుపుకుని రూ.22.79 కోట్లు, బ్యాంకుల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, సేవింగ్ ఖాతా లపై వడ్డీ తదితరాల రూపంలో మరో రూ.18.10 కోట్లు సమకూరాయి. విరాళాల్లో ఎలక్టోరల్ బాం డ్ల రూపంలో రూ.89.15 కోట్లు, వ్యక్తిగత దాతల నుంచి రూ.37.42 లక్షలు వచ్చాయి. ప్రకటనల కు రూ.2.69 కోట్లు, ప్రచారానికి రూ.4.94 కోట్లు కలుపుకుని మొత్తంగా ఎన్నికల కోసం రూ.7.64 కోట్లు ఖర్చు చేసింది. వీటితోపాటు పార్టీ కార్యా లయాల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులు కలుపుకుని ఏడాది కాలంలో రూ.21.18 కోట్లు పార్టీ అవసరాల కోసం ఖర్చు చేశారు. -
గానస్పర్శ
-
92 ఏళ్ల బామ్మ మారథాన్ రికార్డ్
శాన్ డియాగో: పర్వంలో ఉన్నవాళ్లే పట్టుమని పది మైళ్లు పరుగెత్తాలంటే ఆపసోపాలు పడతారు. అటువంటిది... అమెరికాకు చెందిన 92 ఏళ్ల, 65 రోజుల వయస్సు మీద పడిన బామ్మ ఏకంగా 26 మైళ్ల మారథాన్‌ను ఆదివారం నాడు పూర్తిచేసి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన వృద్ధ మహిళగా సరికొత్త చరిత్రను సృష్టించారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిర్వహించిన ఈ మారథాన్‌ను వీక్షకుల కరతాళ ధ్వనులు, కేరింతల మధ్య ఏడు గంటల, 24 నిమిషాల, 36 సెకండ్లలో చెక్కు చెదరని నవ్వుతో పూర్తిచేసి యువతకే స్ఫూర్తిగా నిలిచిందీ బామ్మ. విజయవంతంగా మారథాన్‌ను పూర్తిచేశాక, అలసట ఏమోగానీ కాస్త నరాలు బిగుసుకుపోయినట్టు అనిపించిందని స్థానిక మీడియాకు తెలియజేసింది హరియెట్టి థామ్సన్ అనే ఈ బామ్మ. ‘వాస్తవానికి చిన్న పర్వత ప్రాంతాన్ని ఎక్కుతున్నప్పుడు 21వ మైలు వద్ద అలసిపోయాను. ఈ వయస్సులో నాను ఇదేమి క్రేజీ అని కూడా అనుకున్నాను. ఈ పర్వతం నుంచి దిగుతున్నప్పుడు మాత్రం కాస్త ఉత్సాహంగానే అనిపించింది. ఎప్పటికప్పుడు అలసటను అధిగమించి శక్తిని కూడదీసుకునేందుకు నా కుమారుడు బ్రెన్నీ కార్బోహైడ్రేట్స్ ఇస్తూ ప్రోత్సహిస్తూ వచ్చాడు’ అని బామ్మ ముసిముసిగా చెప్పంది. మొత్తం 26 మైళ్ల మారథాన్‌లో మొదటి నుంచి చివరి వరకు బామ్మ కుమారుడు బ్రెన్నీ ఆమె వెన్నంటే మారథాన్ చేస్తూ వచ్చారు. ఈ బామ్మకన్నా ముందుకూడా ప్రపంచంలో అతివృద్ధ మహిళగా మారథాన్‌ను పూర్తిచేసిన రికార్డు కూడా ఓ అమెరికా బామ్మ పేరిటే ఉంది. ‘గ్లాడియోటర్’గా ముద్రపడిన గ్లేడిస్ బర్రిల్ అనే బామ్మ తన 92 ఏళ్ల, 19 రోజుల ప్రాయంలో 2010, హొనలులులో జరిగిన మారథాన్‌ను పూర్తిచేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును థామ్సన్ బామ్మ తిరగరాశారు. కేన్సర్‌పై పోరాటం చేసి స్వయంగా ఆ వ్యాధి బారి నుంచి బయట పడిన ఈ బామ్మ కేన్సర్‌పై పరిశోధనల కోసం నిధుల సేకరణ నిమిత్తం ఈ మారథాన్‌లో పాల్గొంది.