సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య బుధవారం నాటికి 8,092కు పెరిగింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,00,000కు ఎగబాకింది. యూరప్, ఆసియా దేశాల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మాయదారి వైరస్ 684 మందిని పొట్టనపెట్టుకుంది. తాజాగా యూరప్ కరోనా వ్యాప్తి కేంద్రంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటలీలో బుధవారం వైరస్ కారణంగా 400కు పైగా మరణాలు చోటుచేసుకోవడం కలవరం రేకెత్తిస్తోంది.
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఐరోపా యూనియన్ తమ సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించింది. ఇటలీ సహా యూరప్ అంతటా లాక్‌డౌన్ ప్రకటించడంతో లక్షలాది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కోవిడ్-19ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించడంతో పాటు నిపుణల నుంచి సలహాలను ఆహ్వానించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment