వావ్...‘అమ్మ’మ్మా...
తన కూతురి కోసం.. ఓ తల్లి ఎవరూ చేయని సాహసం చేసింది. 67 ఏళ్ల వయసులో సరొగేట్ తల్లిగా మారి.. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత పెద్దవయసులోని సరొగేట్ తల్లిగా ఆమె నిలిచింది. ఈ ఘటన గ్రీస్‌లో జరిగింది. ఏడున్నర నెలల గర్భం అనంతరం సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు. ఆ బిడ్డ పుట్టినప్పుడు 1.2 కిలోల బరువుంది. ఇప్పుడు తనకు తల్లిలా కంటే అమ్మమ్మలాగే ఎక్కువ అనిపిస్తోందని అనస్టాసియా ఓంటు అనే ఆ వృద్ధురాలు చెప్పారు. ఈమె మధ్య గ్రీస్‌లోని లారిసా అనే గ్రామానికి చెందినవారు. గర్భం దాల్చిన సమయంలో తాను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నానన్నారు.
తన కూతురు సొంత బిడ్డను కనలేదని తెలిసినప్పుడు ఆమె గుండె పగిలేలా ఏడ్చిందని అనస్టాసియా అన్నారు. విషయం ఏమిటంటే.. ఆమె కూతురు కాన్‌స్టాంటినా (43) కేన్సర్ కారణంగా 2009లోనే మరణించింది. అంతకుముందు ఆమెకు ఏడుసార్లు గర్భం పోయింది. దాంతో.. ఆమె చనిపోవడానికి ముందు.. ఆమె బిడ్డకు తాను తల్లినవుతానని చెబితే ఏమాత్రం నమ్మలేకపోయిందని, కానీ తాను చాలా ధైర్యం చేసి ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అంతర్జాతీయ రికార్డులను బట్టి చూస్తే, ఇప్పటివరకు ఇంత పెద్ద వయసులో సరొగేట్ మదర్‌గా ఎవరూ లేరని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ పాంటోస్ తెలిపారు. ఇది ప్రత్యేకమైన కేసు కావడంతో కోర్టు కూడా అనుమతి తెలిపిందని, ఆ తర్వాత తాను ముందుకెళ్లానని ఆయన వివరించారు.