జిఫ్.. జబర్దస్త్..
ఇలా నడిచే కుక్కను మీరెక్కడైనా చూశారా? చాలా మంది తమ పెంపుడు శునకం విసిరేసిన బాల్‌ను తెచ్చిస్తేనే.. సూపర్ అంటూ మురిసిపోతారు. అలాంటిది.. జిఫ్(4) అనే ఈ కుక్క చేసేవి చెబితే.. సూపర్‌లాంటి పదాలెన్ని వాడినా దీని టాలెంట్‌కు సరిపోవు. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఉండే జిఫ్ తన వెనుక కాళ్లపై 32 అడుగుల దూరాన్ని కేవలం 6.56 సెకన్లలో.. 16 అడుగుల దూరాన్ని తన ముందు కాళ్లపై 7.76 సెకన్లలో పరిగెత్తేయగలదు.
అందుకే.. రెండు కాళ్లపై అత్యంత వేగంగా పరుగెత్తే శునకంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. సెప్టెంబర్‌లో విడుదలయ్యే గిన్నిస్ బుక్-2015 ఎడిషన్‌లో మొదటి రికార్డు కూడా దీనిదేనట. ఇదొక్కటేనా.. జిఫ్ షేక్‌హ్యాండ్ ఇస్తుంది. డాన్సులేస్తుంది. స్కేట్‌బోర్డుపై రైడింగ్ చేస్తుంది. అభిమానులు అడిగితే.. ఆటోగ్రాఫ్(కాలి ముద్ర వేస్తుంది) కూడా ఇస్తుంది.