ఈ స్నేహం సూపరో సూపర్..
తైపీ: ఈ మధ్య మనుషులకే సంబంధాలు ఇమడం లేదుగానీ.. పుట్టుకతోనే బద్ధశత్రువులైన కుక్క పిల్లి, పిల్లి ఎలుక, ఎలుక పామువంటికి మాత్రం స్నేహం ఇట్టే కుదిరిపోతోంది. అది ఎంత గాఢంగా అంటే తమ ముందున్న ఎలాంటి సమస్యనైనా అధిగమించి శత్రువనుకున్నవారిని మిత్రువుగా మార్చుకునేంత. ఈ అంశానికి తైపీలోని ఓ పెంపుడు జంతువుల ఇల్లు సజీవ సాక్ష్యంగా నిలిచింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే దాదాపు 14లక్షలమందికి పైగా ఈ వీడియోను చూశారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా.. తైవాన్ లోని తైపీ నగరంలోగల జోలిన్ పెట్ హౌజ్లో ఓ బుజ్జి కుక్క పిల్ల(జై)ను, మరో బుజ్జి పిల్లి(వీరు)ని వేర్వేరు గ్లాస్ నిర్మాణాల్లో పెట్టారు. అవి పైకి ఎక్కి పారిపోలేనంత పకడ్బందీగా ఏర్పాటుచేశారు. పక్కపక్కనే ఉన్న జైకి, వీరుకి స్నేహం కుదిరింది. కానీ, అస్సలు కలుసుకోలేవు. ఎందుకంటే మధ్యలో గ్లాస్ అడ్డు. అప్పుడప్పుడు నిద్రలోకి వెళ్లే అవి కాస్త మెలకువ వచ్చినప్పుడు మాత్రం ఒకదానిని ఒకటి చూసుకుంటూ మురిసిపోతుండేవి.
ఒక రోజు బుజ్జి జై చిన్న కునుకు తీస్తుండగా తెలివైన వీరు మ్యావ్ అని అరుస్తూ గ్లాస్ గోడపైకి ఎక్కేసింది. వాస్తవానికి అక్కడి నుంచి అది పారిపోవచ్చు.. అయితే అప్పటికే నిద్రపోతున్న తన స్నేహితుడు జై నిద్ర లేచాడు. వెంటనే తన స్నేహితుడిని ఆహ్వానిస్తూ తన ముందు కాళ్లు అందించాడు. ఒక్కసారిగా మిత్రుడి స్పర్ష తగలడంతో మరింత కష్టపడి జైతో కలిసిపోయింది వీరు. ఇన్ని రోజులు పక్కపక్కనే ఉన్నా.. దూరమైన తన స్నేహితుడు తన పక్కకే వచ్చేసరికి బుజ్జి కుక్కపిల్ల సంతోషంతో తోకను ఊపుతూ ప్రేమగా తన మిత్రుడిపై ముద్దుల వర్షం కురిపించింది. అదెలాగో ఆ వీడియోను మీరే చూడండి.