పంచామృతం: వీళ్ల పెంపకం ప్రత్యేకం...!
పెంపుడు జంతువులు అంటే... కుక్క, పిల్లి అనేది అందరి మాట. అయితే పెంచుకొనే ఓపిక, ఆసక్తి ఉండాలి కానీ.. అందులో కూడా ప్రత్యేకతను చూపించవచ్చని నిరూపిస్తున్నారు అనేక మంది సెలబ్రిటీలు. అలాంటి అరుదైన ఆసక్తితో అరుదైన పెట్‌లను పెంచుతున్న కొంతమంది...
క్రిస్టెన్ స్టివర్ట్
‘టై్వలైట్’ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకొన్న నటి క్రిస్టెన్ స్టివర్ట్. ఆ సినిమాలో ఒక అతీంద్రియ శక్తిని ప్రేమించిన ఈ యువతి నిజ జీవితంలో కూడా అందరి కన్నా భిన్నమైన పెట్‌ను పెంచుకొంటోంది. ‘జాక్’ అనే ఒక తోడేలును పెంచుకొంటోంది ఆమె. జనావాసాల మధ్య తోడేలును పెంచుకోవడం గురించి ఆమె ప్రత్యేక అనుమతిని కూడా తీసుకొంది.
మైక్ టైసన్...
పక్కన ఒక పులి పిల్లను కూర్చోబెట్టుకొని తన ఫెరారీ ని ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ అలా సుదూర ప్రాంతాలకు వెళ్లడం మైక్‌టైసన్‌కు బాగా ఇష్టం. అయితే ఆర్థికంగా బాగా దెబ్బతిన్న టైసన్ ఫెరారీలను అమ్ముకొన్నాడు. కానీ పులి పిల్లలను మాత్రం అలాగే ఉంచుకొన్నాడట. కుక్క పిల్లను పట్టుకున్నట్టుగా దానిని పట్టుకుని షికారు వెళుతుంటాడు ఈ అలనాటి బాక్సింగ్ ఛాంపియన్.
జస్టిన్ బీబర్...
ఈ కెనడియన్ పాప్‌స్టార్ ‘మాలి’ అనే కోతిని పెంచుకుంటున్నాడు. అది ఎప్పుడూ తన వెంటే ఉండాలనేది బీబర్ కోరిక. అయితే ప్రతిసారి అనుమతులు తీసుకొనేంత సమయం ఉండకపోవచ్చు. అందుకే ఎక్కడికైనా మాలిని వెంట తీసుకెళ్లాలి అని బలంగా అనుకున్నప్పుడు ప్రైవేట్‌జెట్‌ను ఏర్పాటు చేసుకుంటాడట బీబర్.
బ్రెట్ లీ...
వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ.. ఈ ఆస్ట్రేలియన్ స్పీడ్‌స్టార్ ఒక పందిని పెంచుతున్నాడు. ఆ వరాహం అంటే లీకి ప్రాణం. విదేశీ టూర్లకు వెళ్లేప్పుడు దాన్ని మిస్సవుతుంటానని బ్రెట్‌లీ చాలా ఫీలవుతూ ఉంటాడు. అయితే విమానాల్లో పెంపుడు పందిని వెంట తీసుకు వెళ్లాలంటే చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే లీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు దాన్ని అస్సలు మిస్సవ్వడట.