శునకంపై విశ్వాసం!
శునకం మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు. ఇలాంటి జంతువుపై కొందరు మనుషుల్లో ఎంతో విశ్వాసం ఉంటుంది. అపారమైన ప్రేమ ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు హాలీవుడ్ సుప్రసిద్ధనటుడు సిల్వెస్టర్ స్టాలోన్. తన కెరీర్ ఆరంభంలో తన పెంపుడు కుక్క గురించి పడ్డ తపన చాలా గొప్పది. ఆ మూగజీవి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు అబ్బురమనిపిస్తుంది. ఫుడ్డుకు లాటరీ కొడుతున్న దశలో సిల్వెస్టర్ స్టాలోన్‌కు ఒక పెంపుడు కుక్క ఉండేది.
సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒకసారి చేతిలో ఉన్న డబ్బుఅయిపోయింది. ఇదే సమయంలో ఒక వ్యక్తి స్టాలోన్ పెంపుడుకుక్కను కొంటానని ముందుకు వచ్చాడు! అవసరం స్టాలోన్‌తో ఆ శునకాన్ని అమ్మించింది. రోజులు గడిచాయి.. అవకాశాలు కలిసి వచ్చాయి. స్టాలోన్‌కు మంచి సినిమా అవకాశం వచ్చింది. హీరో తనే, దర్శకుడు తనే! అడ్వాన్స్‌గా వేల డాలర్లు చేతిలో వచ్చి పడ్డాయి. ఆ డబ్బు చేతిలోకి రాగానే ఈ హీరో చేసిన మొదటి పని... తన శునకాన్ని కొనుకొన్న వ్యక్తిని కలవడం.
తన పెట్‌ను తనకు తిరిగి ఇవ్వమని, ఎంత డబ్బయినా ఇస్తానని బతిమిలాడాడు. అవతలి వ్యక్తి స్టాలోన్‌కు తన పెట్ డాగ్ మీద ఉన్న ప్రేమను క్యాష్ చేసుకొన్నాడు. 50 డాలర్లకు కొన్న శునకాన్ని స్టాలోన్‌కే తిరిగి 15వేల డాలర్లకు అమ్మాడు. తన తొలి సంపాదనగా వచ్చిన మొత్తం డబ్బును అతడికిచ్చి తన శునకాన్ని తెచ్చుకున్నాడు. తర్వాతి కాలంలో తన సినిమాల్లో కూడా ఆ శునకాన్ని నటింపజేశాడు ఈ దర్శకహీరో!