లేచి కూర్చుంది...!  | Gulnora Rapikova became normal with Apollo treatment At Delhi | Sakshi
Sakshi News home page

లేచి కూర్చుంది...! 

Published Sun, Jul 8 2018 3:57 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

Gulnora Rapikova became normal with Apollo treatment At Delhi - Sakshi

గుల్నోరా

వీలైతే నుంచోవడం, లేదంటే ఒక పక్కకు ఒరిగి పడుకోవడం.. 
గుల్నోరా రపిఖోవాకు ఈ రెండే తెలుసు.  
చిన్నతనపు ప్రమాదం మిగిల్చిన మానని గాయం ఫలితమిది.  
ఇన్నాళ్లకు.. కచ్చితంగా చెప్పాలంటే.. ఏకంగా 32 ఏళ్లకు... 
ఈ ఉజ్బెక్‌ మహిళ కష్టాలు తొలగిపోయాయి. 


...ఇప్పుడు మనందరిలా తనూ లేచి కూర్చోగలదు! ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి వైద్యులు ఒక చిన్న సర్జరీతో గుల్నోరా రపిఖోవాకు ఆ నరకం నుంచి విముక్తి కలిగించారు. ఆమె ఇప్పుడు హాయిగా కూర్చుంటోంది. ‘‘నాకు చెప్పలేనంత భయం వేస్తోంది. అదే సమయంలో పట్టరాని ఆనందంగా ఉంది’’అంటూ నేలపై కూర్చొని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు సమీపంలో సిర్‌దర్య అనే కుగ్రామం గుల్నోరా రపిఖోవా సొంతూరు. ఐదేళ్ల వయసులో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంలో దుస్తులకు మంటలు అంటుకుని వీపు నుంచి మోకాళ్ల వరకూ గాయాలయ్యాయి. ఆసుపత్రిలో ఏడాదిన్నరపాటు మృత్యువుతో పోరాడింది. ఐదుసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించినా కాలిన గాయాలు మానలేదు. దీంతో ఆమెకు కూర్చోవడానికి వీలయ్యేది కాదు. ‘జీవితం దుర్భరంగా మారింది. నిల్చోవడం లేదంటే ఒక పక్కకు ఒరిగి పడుకోవడం. మరో విధంగా ఉండలేకపోయా. ఎనిమిదేళ్ల వయసులో స్కూలుకు వెళ్లాను.

నిల్చునే పాఠాలు వినేదాన్ని. మందులతోనే నొప్పిని నియంత్రించుకోవాల్సిన పరిస్థితి. సౌకర్యంగా ఉండేందుకు అన్ని రకాల అవకాశాలను నాకు నేను వెతుక్కుని ఉపయోగించా’‘అంటూ గుల్నోరా చెప్పుకొచ్చింది. ఈ దశలో ఆరునెలల క్రితం ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఓ వైద్యశిబిరం గుల్నోరాలో కొత్త ఆశలు చిగురింపజేసింది. అపోలో హాస్పిటల్స్‌ వైద్యులు నిర్వహించిన ఈ శిబిరానికి వెళ్లిన అమెను పరిశీలించిన ప్లాస్టిక్‌ కాస్మోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ షాహిన్‌ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ స్థాయిలో కండరాలు కాలిపోవడం ఎప్పుడూ చూడలేదని, అసలు 30 ఏళ్లుగా ఆమె ఆ బాధను భరిస్తూ ఎలా జీవించి ఉందో అర్థం కాలేదన్నారు డాక్టర్‌ షాహిన్‌. అయితే సర్జరీతో ఆమె కూర్చునేలా చేయొచ్చని గుల్నోరా తల్లిదండ్రులకు చెప్పారు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె తల్లిదండ్రులకి సర్జరీ ఖర్చు భరించే ఆర్థిక స్థోమత లేదు.

అయితే తాష్కెంట్‌కు చెందిన ఒక మనసున్న వ్యక్తి ఆ ఖర్చు భరించడానికి ముందుకొచ్చారు. దీంతో గత మే 26న ఆమెని ఢిల్లీకి తీసుకువచ్చారు. మే 31న శస్త్రచికిత్స చేశారు. నిజానికి ఆ సర్జరీ అంత సంక్లిష్టమైనదేం కాదని డాక్టర్‌ షాహిన్‌ చెప్పారు. ఆమె కాలికి ఉన్న చర్మాన్ని తీసి కాలిన గాయాలపై ఆ చర్మాన్ని గ్రాఫ్టింగ్‌ చేశారు. రెండు గంటలకుపైగా పట్టిన ఈ సర్జరీ విజయవంతం కావడంతో గుల్నోరా ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. ‘నేను ఇప్పుడు కూర్చుంటున్నాను. ఈ విషయం మా అమ్మానాన్నలకు చెప్పా. నమ్మబుద్ధి కావడం లేదంటూ వాళ్లు పెద్దగా ఏడ్చేశారు. నన్ను చూస్తే తప్ప వాళ్లకి నమ్మకం రాదేమో‘అంటూ గుల్నోరా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. భారత్‌ వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతోంది. బాలీవుడ్‌ సినిమాలు, హిందీ పాటలంటే అమితంగా ఇష్టపడే రపిఖోవాకు షారూక్‌ ఖాన్, కాజల్‌ అంటే చాలా ఇష్టమట. కానీ ఇప్పుడు భారత్‌ ప్రజల మనసు ఎంత గొప్పదో వర్ణిస్తూ మురిసిపోతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement