ఘటనాస్థలి వద్ద అప్రమత్తంగా పోలీసులు
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్ పట్టణంలో శనివారం ఉదయం యూదుల ప్రార్థనా మందిరం(సినగోగ్)లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు సహా 8 మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. మరో డజను మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. ప్రజలు ఉదయపు ప్రార్థనల్లో నిమగ్నమై ఉండగా దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు వార్తలు వెలువడ్డాయి. దాడి తరువాత నిందితుడు రాబర్ట్ బోయర్స్ పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించింది. ఇది విద్వేషపూరిత దాడి అని, ఉగ్రకోణం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
సినగోగ్ మూడో అంతస్తులో బోయర్స్, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ క్రమంలో గాయపడిన అతడు ఆ తరువాత లొంగిపోయేందుకు అంగీకరించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. శ్వేత జాతీయుడైన బోయర్స్ గడ్డంతో ఉన్నాడని, యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరుగెత్తుతూ కనిపించాడని చెప్పారు. దాడి జరిగిన సినగోగ్ భవనంలో తనిఖీల్ని ముమ్మరం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలోని అన్ని ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.ఈ ప్రార్థనా మందిరం ఉన్న స్క్విరిల్ హిల్ ప్రాంతంలో సాయుధుడు సంచరిస్తున్నాడని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అంతకుముందే పోలీసులు స్థానికుల్ని అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment