
షాపింగ్ మాల్ పై ఉగ్రదాడి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. భారీ ఆయుధ సామాగ్రతో నగరంలోని అల్ జవహర్ షాపింగ్ మాల్ లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి ప్రారంభమైన ఈ మారణకాండలో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా సహా ఏడుగురు మరణించగా, 30 మందికిపైగా గాయపడ్డారు. ఉగ్రవాదులు మరో 100 మందిని మాల్ లోపల బందీలుగా పట్టుకున్నారు.
'తొలుత షాపింగ్ మాల్ ఎదుట కారు బాంబును పేల్చిన దుండగులు లోనికి ప్రవేశించి కాల్పులు జరిపి పలువురిని బందీలుగా చేసుకున్నారని, బందీల్లో అత్యధికులు మహిళలేనని సైనికాధికారులు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒంటినిండా బాంబులు ధరించిన దాదాపు 20 మంది ఉగ్రవాదులు మాల్ లోపల ఉన్నారు. వారిలో కొందరు మాల్ పై భాగంలో నక్కి.. బందీలను విడిపించేందుకు లోపలికి వెళ్లజూసిన పోలీసులను పైనుంచి కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఇరాక్ ప్రత్యేక రక్షక బలగాల ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.