వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న హెచ్–1బీ వీసాదారులైన వారి జీవిత భాగస్వాముల ఉద్యోగం గాలిలో దీపంలా మారింది. వీరితోపాటు ఉద్యోగానుమతుల కోసం ఎదురుచూస్తున్న మరికొందరు తమ కెరీర్ ప్రమాదంలో పడిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హెచ్1–బీ వీసాపై అమెరికాలో ఉంటూ గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయ వృత్తి నిపుణుల భర్త/భార్య ఉద్యోగం చేసుకునేందుకు ఒబామా హయాంలో ప్రభుత్వం చట్టం చేసింది. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వలసదారుల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్ల తరఫున ‘సేవ్‌జాబ్స్ యూఎస్‌ఏ’ అనే సంస్థ 2015లో కోర్టులో కేసు వేసింది.]
అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉంది. అయితే, ఈ కేసుపై విచారణ చేపట్టాల్సిందిగా నెల క్రితం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఆదేశాలిచ్చింది. ఇందుకు సంబంధించిన వాదనలు వినిపించేందుకు.. వలస ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ‘ఇమిగ్రేషన్ వాయిస్’ అనే సంస్థకు కూడా అవకాశమిచ్చింది. అయితే, కోర్టు నిర్ణయం హెచ్–1బీ వీసాదారులకు అనుకూలంగా వచ్చినా తన ప్రతిపాదనలను అమలు చేయాల్సిందేనని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment