వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్న హెచ్-1బి ఉద్యోగులకు ఊరట. ఉద్యోగం పోయిన రెండు నెలల్లోపే కొత్త కొలువు వెతుక్కోవాలన్న నిబంధనను సడలించి గ్రేస్ పీరియడ్‌ను ఆర్నెల్లకు పెంచాలని అధ్యక్షుని సలహా సంఘం సిఫార్సు చేసింది. తద్వారా కొత్త ఉపాధి అవకాశం వెతుక్కునేందుకు వారికి తగినంత సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. దీనికి అధ్యక్షుని ఆమోదం లభిస్తే కొన్నాళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది భారత టెకీలకు భారీ ఊరట కలగనుంది.
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల మేరకు వారంతా 60 రోజుల్లోగా మరో ఉపాధి చూసుకోలేని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులకు పెంచాల్సిందిగా సిఫార్సు చేసినట్టు ఆసియా అమెరికన్లు తదితరులపై అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజన్ జైన్ భుటోరియా వెల్లడించారు. అమెరికాలో 2022 నవంబర్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఏకంగా 80 వేల మంది భారతీయులేనని అంచనా!
గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఊరట!
మరోవైపు, ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో ఆమోదిత ఐ-140 ఉపాధి ఆధారిత వీసా పిటిషన్లుండి, ఐదేళ్లకు పైగా గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నవారికి ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) జారీ చేయాలని అధ్యక్షుని సలహా కమిటీ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇమిగ్రెంట్ వారి వీసా దరఖాస్తులపై తుది నిర్ణయం వెలువడేదాకా అమెరికాలో వృత్తి, ఉద్యోగాలు కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని కమిటీ సభ్యుడు అజన్ జైన్ భుటోరియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment