ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి, జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్ పాకిస్థాన్ ప్రభుత్వానికి చుక్కులు చూపిస్తున్నాడు. న్యూయార్క్‌లో తనపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. పాక్ విదేశాంగమంత్రిపై పరువునష్టం దావా వేశాడు. 10కోట్ల రూపాయలకు ఖవాజ ఆసిఫ్‌పై క్రిమినల్ దావా ఫైల్ చేశాడు.
న్యూయార్క్‌లో జరిగిన ఆసియా దేశాల ఫోరంలో మాట్లాడిన ఆసిఫ్.. 'డార్లింగ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్' అంటూ హఫీజ్ సయీద్‌ని అభివర్ణించారు. హక్కాని నెట్‌వర్క్, లష్కరేతోయిబా వంటి ఉగ్రసంస్థలు పాక్‌కు గుదిబండలుగా తయారయ్యారని ఆయన అంగీకరించారు. ఆ ఉగ్రమూకల నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం శత్రువుగా చూస్తున్న హఫీజ్ సయీద్‌ను గతంలో అమెరికాకు ఎంతో ప్రియమైన వ్యక్తి అన్న విషయం మరచిపోకూడదని వ్యాఖ్యానించారు. ముస్లిం సంప్రదాయాలను పక్కగా పాటించే తనను 'అమెరికా డార్లింగ్'గా పేర్కొనడాన్ని తప్పుబడుతూ.. ఖవాజి ఆసిఫ్‌పై హఫీజ్ పరువునష్టం దావా వేశాడు.