టీనేజర్లకు ఇంటర్నెట్ ముప్పు!
న్యూయార్క్ : ఇంటర్నెట్ అధికంగా వినియోగించే టీనేజీ వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఓ రీసెర్చ్లో తేలింది. వారంలో 14 గంటలకు మించి బ్రౌజింగ్ చేసే పిల్లలలో స్థూలకాయం, బీపీ లాంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా వారానికి 25 గంటలకు మించి ఇంటర్నెట్ వాడితే వారి ఆరోగ్యం మరింత దెబ్బతీంటుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన హెన్రీఫోర్డ్ హాస్పిటల్ వైద్యుడు ఆండ్రియా కాస్సిడీ తెలిపారు. బ్రౌజింగ్ చేసే 335 మంది టీనేజర్లను తమ రీసెర్చ్లో భాగంగా పరీక్షించి ఈ విషయాలు వెల్లడించినట్లు వివరించారు.
50 ప్రశ్నలకు పైగా ఉన్న ప్రశ్నాపత్రాన్ని వారికిచ్చి టెస్ట్ చేసి, వారి బీపీ లెవల్స్ స్థాయి బ్యాలెన్స్ తప్పాయని తెలుసుకున్నారట. 335 మంది పిల్లలకుగానూ 134 మంది పిల్లలు ఇంటర్నెట్పైనే ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు. ఈ యూజర్లలో 26 మందికి టీనేజీలోపే బీపీ వచ్చినట్లు కనుగొన్నామని ఆండ్రియా కాస్సిడీ పేర్కొన్నారు. బ్రౌజింగ్ ఎక్కువ చేసే వారిలో 43 శాతం యూజర్లు అధిక బరువు కలిగి ఉన్నారని, ఇతర యూజర్లలో కేవలం 26 శాతం మందిలో ఈ సమస్యలున్నాయన్నారు.
తల్లిదండ్రులు పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై కొన్ని పరిమితులు విధించాలని తమ రీసెర్చ్ ద్వారా అభిప్రాయపడ్డారు. రోజులో కేవలం రెండు గంటలలోపు బ్రౌజింగ్ చేసే అవకాశం కల్పించాలని, అలాగే వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే ఇంటర్నెట్ వాడేలా చూడాలని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఆండ్రియా కాస్సిడీ సూచించారు.