‘గజ’ మూషికం
లండన్: భీకరంగా అరుస్తున్న మృగంలా ఉన్న ఇది ఏదో అడవి జంతువు అయి ఉంటుందని అనుకుంటున్నారు కదూ? కానీ కాదు.. ఇది ఓ ఎలుక! అవును.. గేదె సైజు శరీరం, వెయ్యి కిలోల బరువుతో ఉన్న ఈ ఎలుక జాతి జంతువు 30 లక్షల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికాలో సంచరించిందట. ఇప్పటిదాకా కనుగొన్న అన్ని ఎలుక జాతి జంతువుల్లోనూ ఇదే అతిపెద్దదట. గతంలో దొరికిన దీని పుర్రె ఎముకలపై బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ యార్క్, హల్ యార్క్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సాయంతో జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. గీనియా పందులకు కాస్త దగ్గరి పోలికలతో ఉన్న ఈ ఎలుక జంతువు పేరు ‘జోసెఫోఆర్టిగాసియా మోనెసీ’. దీని కత్తెర పళ్లు(ముందరి దంతాలకు) పులి దంతాలంత బలం ఉండేదట. అయితే ఎలుక మాదిరిగా పైన, కింద రెండు చొప్పున ఉన్న ఈ దంతాలను, ఏనుగు తన దంతాలు ఉపయోగించినట్లుగా వాడుకునేదట. నేలను తవ్వేందుకు, ఇతర జంతువులతో పోరాడేందుకు, ఆహారం తీసుకునేందుకూ ఈ దంతాలను ఉపయోగించేదట.