
పాక్ నుంచి అణు ఆత్మాహుతి బాంబులు
హిల్లరీ ఆందోళన
వాషింగ్టన్: పాకిస్తాన్‌లో అణ్వాయుధాలు జీహాదీల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం తప్పదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భయాందోళనలు వ్యక్తం చేశారు. తద్వారా అణుఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ‘జీహాదీలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారన్న భయంతో జీవిస్తున్నాం. వారు అణ్వాయుధాలు హస్తగతం చేసుకుంటారు. ఫలితంగా అణు ఆత్మాహుతి దాడులకు అవకాశం ఏర్పడుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.
డెమోక్రటిక్ పార్టీ కంప్యూటర్ల హ్యాకింగ్ ద్వారా హిల్లరీ మాట్లాడిన ఆడియో సారాంశాన్ని పత్రిక వెల్లడించింది.గత ఫిబ్రవరిలో వర్జీనియాలో నిధుల సేకరణ సందర్భంగా ఆమె సన్నిహితులతో ఈ వ్యాఖ్యలు చేశారంది. భారత్‌తో ఉన్న శత్రుత్వంతో పాక్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని హిల్ల రీ పేర్కొన్నారు. రష్యా, చైనాతో పాటు పాక్, భార త్ అణ్వాయుధాల్లో పోటీపడుతున్నాయని... ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని అన్నారు.