నువ్వా... నేనా! | Hillary Clinton leads Donald Trump by 14 points nationally | Sakshi
Sakshi News home page

నువ్వా... నేనా!

Published Tue, Oct 11 2016 1:39 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

నువ్వా... నేనా! - Sakshi

నువ్వా... నేనా!

అమెరికాలో పరస్పర ఆరోపణలతో వేడి పుట్టించిన రెండో డిబేట్
హిల్లరీ క్లింటన్‌ను జైల్లో పెట్టిస్తా
• నావి కేవలం మాటలే.. బిల్‌వి అసభ్య చేతలు: ట్రంప్
• ముస్లింలపై ట్రంప్ ఆలోచనలు ప్రమాదకరం
• మహిళలపై అసభ్య పదజాలం ట్రంప్ వ్యక్తిత్వాన్ని  ప్రతిబింబిస్తోంది: హిల్లరీ


సెయింట్ లూయిస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఆదివారం రాత్రి జరి గిన రెండో డిబేట్ పరస్పర ఆరోపణలతో వాడీవేడిగా సాగింది.  మొదటి డిబేట్‌లో పూర్తిగా వెనుకబడ్డ రిపబ్లికన్ పార్టీ నామినీ ట్రంప్ ఈ సారి మాత్రం హిల్లరీపై తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. హిల్లరీ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తాను అధికారంలోకి వస్తే ఈమెయిల్ వివాదంలో హిల్లరీని జైల్లో పెట్టిస్తానంటూ హెచ్చరించారు. అంతకుముందు 2005లో మహిళలపై ట్రంప్ చేసిన అసభ్య వాఖ్యల్ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ తీవ్రంగా తప్పుపట్టారు. సెయింట్ లూయిస్‌లో వాషింగ్టన్ యూనివర్సిటీలో 90 నిమిషాల పాటు సాగిన చర్చలో ఇద్దరూ ఏమాత్రం తీసిపోకుండా ఒకరినొకరు తిట్టుకున్నారు.
 
ఇస్లామాఫోబియా(ముస్లింలంటే అయిష్టం)పై వాగ్యుద్ధం
అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా నిషేధం విధిస్తానన్న ట్రంప్ ఆలోచనలు సంకుచితం, ప్రమాదకరమని హిల్లరీ పేర్కొన్నారు. దానికి ట్రంప్ సమాధానమిస్తూ... ‘అమెరికాలో ముస్లింల ప్రవేశంపై నిషేధం ఎంత మాత్రం తన విధానం కాదు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారి పూర్వాపరాలు క్షుణ్నంగా తనిఖీ చేయడంగా ఆ నిషేధాన్ని అర్థం చేసుకోవచ్చు. బరాక్ ఒబామా వల్ల సిరియా వంటి దేశాల నుంచి పదులు, వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఒబామా కంటే హిల్లరీ 550 శాతం వారిని అనుమతించారు.

మనదేశానికి వచ్చేవారెవరో మనకు తెలియడం లేదు. సిరియా నుంచి వందల, వేల మంది ఎవరో తెలుసుకోకుండా అనుమతించడాన్ని నేను అంగీకరించడం లేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. వెంటనే స్పందించిన క్లింటన్... ‘మనం ఇస్లాంతో యుద్ధం చేయడం లేదు. అమెరికాకు ముప్పు అనుకునేవారిని అధ్యక్షురాలిగా దేశంలోకి ఎట్టి పరిస్థితుల్లోను అమనుమతించను.వేల మంది శరణార్ధులు... ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్ని ముస్లింలుగా పేర్కొంటూ అనుమతి నిషేధించ లేం. పూర్వాపరాల విచారణను కఠినంతరం చేయాలి’ అని సమాధానమిచ్చారు.

ఈమెయిల్స్ వివాదంపై విచారణ జరిపిస్తా: ట్రంప్
విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు హిల్లరీ ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వాడటంపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తామని ట్రంప్ చెప్పా రు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే హిల్లరీ జైలుకెళ్లడం ఖాయమన్నారు. ‘ప్రత్యేక విచారణాధికారిని నియమించి ఈమెయిల్ వివాదంపై విచారణ జరిపిస్తాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. ‘హిల్లరీ చేసిన పనికి ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. చేసిన పనికి ఆమె సిగ్గుపడాలి’ అంటూ డొనాల్డ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. క్లింటన్ జోక్యం చేసుకుంటూ... ‘ట్రంప్ అబద్ధాలాడుతున్నారని, ఆయన చెప్పేదంతా పూర్తిగా అవాస్తవాలు’ అని చెప్పారు. ఈ మెయిల్స్ అంశంలో తాను తప్పు చేశానని క్లింటన్ మరోసారి పేర్కొన్నారు.

అసభ్య పదజాలంపై సిగ్గుపడుతున్నా.. ట్రంప్: 2005లో ట్రంప్ మహిళలపై చేసిన అసభ్య వాఖ్యలపై డిబేట్‌లో తీవ్ర వాదోపవాదాలు సాగాయి. ట్రంప్ పదజాలాన్ని హిల్లరీ తీవ్రంగా తప్పుపట్టగా... ప్రతిగా ఆమె భర్త బిల్ క్లింటన్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. గతంలో కొన్ని దశాబ్దాల పాటు బిల్ క్లింటన్ మహిళలపై లైంగిక దాడులు చేశారంటూ విమర్శించారు. ‘మహిళల గురించి ట్రంప్ ఏం మాట్లాడారో మనమంతా విన్నాం, చూశాం. మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో... మహిళల పట్ల ఎలా ప్రవర్తించారో అన్నీ చూశాం. ఆయన వ్యక్తిత్వాన్ని అవి ప్రతిబింబిస్తున్నాయి’ అంటూ హిల్లరీ పేర్కొన్నారు. 2005లో తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ క్షమాపణలు చెప్పారు. అవి లాకర్ రూం సంభాషణలు మాత్రమేనని, వాటి విషయంలో కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పానని, అసభ్య పదజాలంపై చాలా సిగ్గుపడుతున్నానని ట్రంప్ తెలిపారు.

చర్చలో మరింత వేడి పుట్టిస్తూ బిల్ క్లింటన్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ‘నావి మాటలు మాత్రమే. బిల్ క్లింటన్ ఏకంగా మహిళల విషయంలో అసభ్యకర పనులు చేశారు. మహిళలతో ఇంత అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అమెరికా రాజకీయాల్లో ఎవరూ లేరు’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తమపై బిల్ క్లింటన్ లైంగిక దాడి చేశారంటూ ఆరోపించిన నలుగురు మహిళల్ని డిబేట్‌కు ట్రంప్ తీసుకొచ్చారు. చర్చకు ముందు వారితో కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ట్వీటర్‌లో అత్యధికమంది స్పందించిన అధ్యక్ష ఎన్నికల డిబేట్‌గా ఈ చర్చ నిలిచింది. 1.7కోట్ల ట్వీట్లు చేశారంటూ ట్వీటర్ ప్రతినిధి వెల్లడించారు.
 
ట్రంప్ పిల్లల్ని గౌరవిస్తా.. హిల్లరీ: ట్రంప్, హిల్లరీలు చివర్లో ఒకరినొకరు పొగుడుకున్నారు. మీ ప్రత్యర్థిలో ఇష్టపడే మంచి లక్షణం చెప్పండన్న ప్రేక్షకుడి ప్రశ్నకు హిల్లరీ జోక్యం చేసుకుని ‘నేను ట్రంప్ పిల్లల్ని గౌరవిస్తాను. వారు పూర్తి సామర్థ్యం, అంకితభావం కలిగినవారు’ అంటూ కొనియాడారు. ఇక హిల్లరీని ట్రంప్ పొగుడుతూ... ‘ఆమె పోరాట యోధురాలు, చేపట్టిన దాన్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. హిల్లరీలో ఆ అంశాన్ని తాను గౌరవిస్తా’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
 
హిల్లరీ గెలుపు ఖాయం: సర్వేలు

రెండో డిబేట్ అనంతరం హిల్లరీ అమెరికా తదుపరి అధ్యక్షురాలవడం ఖాయమంటూ కొన్ని పోల్స్ తేల్చిచెప్పాయి. సీఎన్‌ఎన్/ఓఆర్‌సీ సర్వేలో హిల్లరీకి 57 శాతం, ట్రంప్‌కు 34 శాతం మద్దతు పలికారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చరిత్ర ముగుస్తోందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. వాషింగ్టన్ పోస్టు కూడా హిల్లరీకే విజయం కట్టబెట్టింది. ఎన్‌బీసీ-వాల్‌స్ట్రీట్ జర్నల్ సర్వే ప్రకారం... హిల్లరీ 14 పాయింట్లు ఎగబాకి 52 శాతంతో ముందజంలో నిలిచారు. ట్రంప్ 38 శాతం మద్దతే సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement