మళ్లీ ఆధిక్యంలో హిల్లరీ క్లింటన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కంటే డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారని రెండు రోజుల క్రితమే ఒక సర్వే వచ్చినా.. మళ్లీ ఈలోపే మరోసారి హిల్లరీ ఆధిక్యంలోకి వచ్చేశారు. ఫాక్స్ న్యూస్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ 2 శాతం పాయింట్ల ముందంజలో ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో క్లింటన్‌కు 45 శాతం మద్దతు లభించగా, ట్రంప్‌కు 43 శాతమే వచ్చింది. మరో ఐదు శాతం మంది గేరీ జాన్సన్‌కు, 2 శాతం మంది గ్రీన్ పార్టీకి చెందిన జిల్ స్టీన్‌కు మద్దతు పలికారు.
ట్రంప్‌కు మద్దతు పలికినవారిలో పురుషులు (+11 పాయింట్లు), తెల్లవారు (+19), కాలేజి డిగ్రీ లేని తెల్లవారు (+33) ఉన్నారు. ఇక హిల్లరీకి అండగా ఉన్నవారిలో మహిళలు (+13), ఆఫ్రికన్-అమెరికన్లు (+74), 30 ఏళ్లలోపువారు (+17) ఉన్నారు. ఇప్పటికే ఒకసారి ఓటు వేసినవారిలో కూడా 11 పాయింట్ల ఆధిక్యం హిల్లరీకే వచ్చింది. డిగ్రీ ఉన్న తెల్లవారిలో 45 శాతం మంది ట్రంప్‌కు మద్దతు పలకగా, హిల్లీరిక 42 శాతం మందే మద్దతుగా ఉన్నారు. 1211 మందిని లాండ్‌లైన్, సెల్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్వ్యూ చేసి ఈ సర్వే ఫలితాలు రాబట్టారు. వారిలో 1107 మంది లైక్లీ ఓటర్లున్నారు.