పాకిస్థాన్ జెండా.. ఫైల్ ఫొటో
కరాచీ: పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి పట్టణంలో హిందువుల ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఓ స్కూలుకు చెందిన హిందూ ప్రిన్సిపాల్ దైవదూషణ చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఘోట్కి పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, మూకదాడులపై పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ చోటుచేసుకున్న మూక దాడుల్లో హిందువుల ఇళ్లు, దుకాణాలు, ఆలయాలు ధ్వంసమైనట్టు మానవ హక్కుల సంస్థ ట్విటర్‌లో పేర్కొంది. వరల్డ్ సింధీ కాంగ్రెస్ అనే సంస్థ కూడా ఘోట్కి పట్టణంలో చోటుచేసుకున్న మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌లోని మతమైనారిటీలకు రక్షణ కల్పించేవిధంగా ఇతర దేశాలు ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని అభ్యర్థించింది.
‘ఘోట్కి పట్టణంలోని హిందూ కమ్యూనిటీపై దాడులు జరుగుతున్నాయి. హిందూ స్కూల్ ప్రిన్సిపాల్ దైవదూషణ చేశాడని ఓ విద్యార్థి ఆరోపించడంతో ప్రిన్సిపాల్ స్కూలుతోపాటు హిందువుల ఆలయాలు, దుకాణాలు, ఇళ్లను ధ్వంసం చేశారు’ అని వరల్డ్ సింధీ కాంగ్రెస్ ట్విటర్‌లో పేర్కొంది. ఘోట్కి పట్టణంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు పేర్కొన్నట్టు పాక్ మీడియా పేర్కొంది. దైవదూషణ చేసిన హిందు ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నట్టు తెలిపింది. అధికారులు మాత్రం దాడులకు కారణమైన గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఘోట్కితోపాటు మీర్‌పూర్ మథెలో, అదిల్‌పూర్ ప్రాంతాల్లో కూడా హింస చోటుచేసుకున్నట్టు డాన్ పత్రిక పేర్కొంది. భారత్‌లో మత మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, వారికి రక్షణ లేకుండాపోయిందని ఒకవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్న సమయంలోనే పాక్‌లోని హిందు మైనారిటీలపై దాడులు జరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment