![Hinduja Brothers Fight Over Letter Dividing 11 Billion Dollar Fortune - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/24/hinduja%20brothers.jpg.webp?itok=Nw53uNv3)
లండన్: ‘హిందూజా బ్రదర్స్’ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మనల్ని వందల సంవత్సరాల పాటు పాలించిన బ్రిటీష్ వారి గడ్డపై అత్యంత ధనవంతులుగా నిలిచిన భారతీయులు. 'ఐకమత్యమే మహాబలం' అనే నానుడి అపరకుబేరులైన హిందుజా సోదరులకు సరిగ్గా సరిపోతుంది. అయితే ప్రస్తుతం వీరి మధ్య కూడా ఆస్తి వివాదాలు నడుస్తున్నట్లు సమాచారం. లండన్ కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుతో ఈ సోదరుల మధ్య ఉన్న వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురు సోదరులు సంతకం చేసిన ఓ లేఖ వారి మధ్య వివాదాన్ని రాజేసింది. అంతేకాక 11.2 బిలయన్ డాలర్ల కుటుంబ సంపద ప్రస్తుతం చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోబోతుంది. ఆ వివరాలు.. 2014 నాటిదిగా చెప్తున్న ఈ లేఖలో ఒక సోదరుడి వద్ద ఉన్న ఆస్తులు అందరికీ చెందినవని.. ప్రతి మనిషి ఇతరులను వారి కార్యనిర్వాహకులుగా నియమిస్తారని పేర్కొంటుంది. అయితే ప్రస్తుతం ఆ కుటుంబ పెద్ద అయిన శ్రీచంద్ హిందూజా(84) అతని కుమార్తె వినో ఈ లేఖను పనికిరానిదిగా ప్రకటించాలనుకుంటున్నారు.
ఈ లేఖను ఆధారంగా చేసుకుని గోపిచంద్, ప్రకాష్, అశోక్ ముగ్గురు సోదరులు హిందూజా బ్యాంక్‌ను నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నించారని విను ఆరోపిస్తున్నారు. శ్రీచంద్ పేరు మీద ఉన్న ఏకైక ఆస్తి ఈ హిందూజా బ్యాంక్ మాత్రమే. ఈ క్రమంలో శ్రీచంద్, అతడి కుమార్తె విను ఈ లేఖకు చట్టపరమైన విలువ ఉండకూడదని.. దానిని వీలునామాగా ఉపయోగించరాదంటూ తీర్పు చెప్పాల్సిందిగా న్యాయమూర్తిని కోరుకుంటున్నారు. అంతేకాక 2016లోనే శ్రీచంద్ ఈ లేఖ తన ఆలోచనలకు విరుద్ధంగా ఉందని తెలపడమే కాక కుటుంబ ఆస్తులను వేరుచేయాలని పట్టుబట్టారని ఆయన కుమార్తె విను తెలిపారు. అయితే శ్రీచంద్ తరపు న్యాయవాది దీనిపై స్పందించడానికి ఇష్టపడలేదు.
అయితే మిగతా ముగ్గురు సోదరులు మాత్రం ఈ కేసు తమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావాన్ని చూపదన్నారు. కానీ ఈ విచారణ తమ వ్యవస్థాపకుడి ఆశయాలకు.. కుటుంబ విలువలకు విరుద్ధంగా ఉందన్నారు. ‘ప్రతిదీ అందరికీ చెందినది.. ఏదీ ఎవరికీ చెందదు’ అనే సూత్రం మీదనే తమ కుటుంబం దశాబ్దాలుగా నడుస్తుందని వారు తెలిపారు. కుటుంబ విలువలను సమర్థించే వాదనకు తాము మద్దతిస్తామని అని ముగ్గురు సోదరులు ఒక ఇమెయిల్ ద్వారా తెలిపారు. ఒకవేళ ఈ దావా గనక విజయవంతమైతే.. బ్యాంక్‌లోని మొత్తం వాటాతో సహా శ్రీచంద్ పేరులోని అన్ని ఆస్తులు అతని కుమార్తె వినుకి.. ఆమె వారసులకు చెందుతాయని ముగ్గురు సోదరులు తెలిపారు.
ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో హిందూజా కుటుంబం ఒకటి. వారి సంపదలో ఎక్కువ భాగం హిందూజా గ్రూప్ నుండి వచ్చింది. దీనికి ఒక శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. ఈ రోజు వీరికి దాదాపు 40 దేశాలలో ఫైనాన్స్, మీడియా, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక హిందూజా కుటుంబ సంపదను 11.2 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment