
వరుసగా తొమ్మిదిసార్లు తాగి పట్టుబడి..
టెక్సాస్: వరుసగా తాగి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తికి అమెరికా కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది. 56 ఏళ్లు ఉన్న ఆ వ్యక్తి బయట ఉంటే ప్రమాదం అని పేర్కొంటూ ఇక జైలులో ఉండటమే సరైన శిక్ష అని చెప్పింది. హ్యూస్టన్కు చెందిన డోనాల్డ్ మిడిల్టన్ అనే 56 ఏళ్ల వ్యక్తి 1980 నుంచి ఇప్పటి వరకు పీకలదాకా మద్యం తాగి వాహనం నడుపుతూ తొమ్మిదిసార్లు పోలీసుల చేతికి చిక్కాడు. గత 2015 మే నెలలో కూడా ఫుల్లుగా తాగి ఓ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు.
అనంతరం పారిపోయి ఓ దుకాణంలో దాక్కొని పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలకు అతడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టుకు తరలించారు. ఈ ఒక్కసారి తనను క్షమించాలని అతడు వేడుకున్నప్పటికీ కోర్టు నిరాకరించింది. జీవిత కారాగార శిక్ష విధించింది. అంతకుముందే తాగి వాహనం నడిపిన కేసులోనే నాలుగుసార్లు అతడు జైలు శిక్ష అనుభవించాడు.