మద్యం తాగితే రొమ్ము కేన్సర్ ముప్పు అధికం!
మద్యం తాగడం వల్ల కేన్సర్ కారక జన్యువు స్థాయి మరింత పెరిగి, రొమ్ము కేన్సర్ వచ్చే ముప్పు ఎక్కువవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మద్యం అతిగా తాగడం వల్ల ఈస్ట్రోజన్ స్థాయి పెరుగుతుందని, దానివల్ల రొమ్ము కేన్సర్ కణాల ఎదుగుదల కూడా ఎక్కువ కావడంతో పాటు, ఈస్ట్రోజన్‌ను అడ్డుకోడానికి ఉపయోగపడే టామోక్సిఫెన్ అనే మందు పనిచేయడం కూడా తగ్గుతుందని, దానివల్ల బీఆర్ఏఎఫ్ అనే కేన్సర్ కారక జన్యువు స్థాయి పెరుగుతుందని ఈ అంశంపై పరిశోధనలో పాల్గొన్న హ్యూస్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చిన్ యో లిన్ తెలిపారు.
రొమ్ము కేన్సర్ కణాల విషయంలో ఈస్ట్రోజన్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని నిర్ధారించేందుకు ఈ పరిశోధన నిర్వహించారు. మహిళల్లో ఉండే సెక్స్ హార్మనో ఈస్ట్రోజన్ స్థాయి ఎక్కువ కావడం వల్ల రొమ్ము కేన్సర్ ముప్పు ఎక్కువ అవుతుంది. కేన్సర్ కణాలు వేగంగా పెరగడాన్ని అడ్డుకునే టామోక్సిఫెన్ మందు సామర్థ్యాన్ని కూడా మద్యం తగ్గిస్తోందన్నది ఈ పరిశోధనలో తేలిన మరో ప్రధానమైన అంశం. మద్యం తాగడం వల్ల కేన్సర్‌కు సంబంధించిన చాలా అంశాలు ప్రభావితం అవుతాయని కూడా తెలిసింది.