
పారిస్: పారిస్‌లోని ఓ అపార్టుమెంట్‌లో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనను విద్రోహ చర్యగా అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని 16వ డిస్ట్రిక్ట్ ర్యుఎర్లాంగర్ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్టుమెంట్‌లో అర్థరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పై అంతస్తుల్లో మంటలు వ్యాపించటంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
సుమారు 200 మంది అగ్ని మాపక సిబ్బంది ఐదు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారని మేయర్ తెలిపారు. సుమారు 50 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన 10 మంది మృతి చెందగా ఆరుగురు అగ్ని మాపక సిబ్బంది సహా మొత్తం 30 మంది గాయపడ్డారని ఆమె వెల్లడించారు. విద్రోహ చర్యగా భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించి ఒక మహిళ(40)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారి స్తున్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు మేక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పారిస్‌లోని భవంతిలో మంటలు వ్యాపించిన దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment