మానవుల అక్రమ రవాణాలో చైనా రికార్డ్
మానవుల అక్రమ రవాణాలో చైనా రికార్డ్
Published Tue, Jul 11 2017 2:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM
బీజింగ్: ప్రపంచంలోకెల్లా చైనాలోనే మానవుల అక్రమ రవాణా ఎక్కువగా సాగుతోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో రష్యా, సిరియా, ఇరాన్‌లను చైనా మించి పోయిందంటూ అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. చైనాలో మానవుల అక్రమ రవాణా, దాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను పరిగణలోకి తీసుకొని మానవుల అక్రమ రవాణా సూచికలో చైనాను ‘టైర్ 3’ కేటిగిరీగా ప్రకటించింది. వన్, టూలకన్నా మూడవ టైర్ 3 కేటగిరీ మరీ అధ్వాన్నమైన స్థానం. గత రెండేళ్ల క్రితమే చైనా ఈ కేటగిరీ కిందకు చేరినప్పటికీ దీన్ని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావంతో అమెరికా విదేశాంగ ఉపేక్షించి ఇప్పుడు ఆ కేటగిరీని ప్రకటించింది.
చైనాలో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికే కాకుండా ఉత్తర కొరియా లాంటి దేశాల నుంచి మానవుల అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతోంది. ఇందులో పురుషులతోపాటు మహిళలు, పిల్లలు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. వారిని వెట్టి చాకిరీ కూలీలుగా, వ్యభిచారిణులుగా, భిక్షగాళ్లుగా బలవంతాన మారుస్తున్నారు. మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చైనాలో కఠిన చట్టాలు లేకపోవడం కూడా ఓ లోపమేనని అమెరికా నివేదికలో వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని నివేదిక విడుదల సందర్భంగా ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 2.10 కోట్ల మంది ప్రజలు అక్రమంగా రవాణా అయ్యారని అంతర్జాతీయ కార్మిక కార్యాలయం తెలియజేస్తోంది. మానవుల అక్రమ రవాణాలో సూచికలో ‘టైర్ 3’ కేటగిరిలో చేర్చిన దేశంతో అమెరికా వాణిజ్య నెరపకుండా ఆంక్షలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ దేశానికి అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. ఈ విషయమైన చైనా విదేశాంగ శాఖను మీడియా సంప్రతించగా, తాము మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అనవసరంగా అమెరికా తమపై నిందలు వేస్తోందని ఆరోపించారు. ప్రపంచ దేశాల మధ్య పరస్సర సహకారం ఉన్నప్పుడు ఈ మానవుల అక్రమ రవాణాను సమర్థంగా అరికట్టగలమని అభిప్రాయపడింది.
Advertisement
Advertisement