వాషింగ్టన్ పోస్ట్ : పోగోట్టుకున్న వస్తువులను తిరిగి పొందడం చాలా చాలా కష్టం. పోయిన వస్తువు కాస్తా ఏ పర్సు లాంటిదో అయితే మరిక దాని గురించి మర్చిపోవాల్సిందే. ఒకవేళ అదృష్టం బాగుండి దొరికినా.. అందులో డబ్బులుండటం మాత్ర కల్ల. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం వీటన్నింటికి కాస్తా భిన్నమైన అనుభవం ఎదురయ్యింది. పోయిన పర్సు దొరకడమేకాక.. దానిలో ఉన్న సొమ్ముకు మరికాస్తా జోడించి మరి చాలా భద్రంగా పార్శిల్ చేశాడు వివరాలు తెలియని ఓ వ్యక్తి. నమ్మడానికి కాస్తా కష్టంగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం.
వివరాలు.. హంటర్ షమత్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి లాస్ వెగాస్‌లో జరుగుతున్న తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. అయితే తన పర్స్‌ను విమానంలోనే మర్చిపోయాడు. దానిలో 40 డాలర్ల సొమ్ముతో పాటు, 400 డాలర్ల విలువ చేసే చెక్, అన్నింటికంటే ముఖ్యమైన అతని ఐడీ కార్డ్ ఉన్నాయి. లాస్ వెగాస్‌లో దిగిన తరువాత తన పర్స్ మర్చిపోయినట్లు గుర్తించిన హంటర్ ఈ విషయం గురించి ఎయిర్‌లైన్స్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చాడు. కానీ ఎటువంటి లాభం లేకపోయింది. పెళ్లికెళ్లి బాగా ఎంజాయ్ చేయాలని భావించిన హంటర్.. తన పర్స్ పోగోట్టుకుని విషాదంలో మునిగి పోయాడు. కనీసం ఐడీ కార్డ్ దొరికిన బాగుండేదనుకున్నాడు హంటర్. ఎందుకంటే అది లేకపోతే అతని తిరిగి తన ఇంటికి వెళ్లలేడు. దాంతో ఈ విషయం గురించి తెగ ఆందోళన పడ్డాడు.
వివాహనంతరం కుటుంబంతో కలిసి వెగాస్ నుంచి తన ఇళ్లు దక్షిణ డకోటాకు ప్రయాణమయ్యాడు హంటర్. ఎయిర్‌పోర్టులో దాదాపు ఓ గంటసేపు విచారించిన తరువాత ఎట్టకేలకు హంటర్‌ని లోనికి అనుమతించారు. గండం గడిచిందంటూ ఇంటికి చేరుకున్న హంటర్‌కోసం అప్పటికే ఓ సర్‌ఫ్రైజ్ ఎదరు చూస్తోంది. అదేంటంటే తాను విమానంలో పొగోట్టుకున్న పర్సు. హంటర్‌తో పాటే విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తి ఈ పర్సును గమనించి తిరిగి దాన్ని హంటర్‌కు చేర్చాడు. పర్సుతో పాటు ఓ ఉత్తరాన్ని కూడా పెట్టాడు సదరు వ్యక్తి.
‘హంటర్ ఈ పాటికే నువ్వు నీ పర్సు కోసం తెగ వెతికి ఉంటావని నాకు తెలుసు. ఈ పర్స్‌ని నువ్వు ఒమాహ నుంచి డెన్వర్‌కు ప్రయాణించిన విమానంలో.. 12 వరుసలో.. సీట్ ఎఫ్(F) వద్ద జారవిడుచుకున్నావ్. దీని కోసం నువ్వు వెతికి ఉంటావనే భావిస్తున్నాను. ఇక మీదటైన దీన్ని జాగ్రత్తగా ఉంచుకో ఆల్ ది బెస్ట్’ అంటూ హితవు పలికాడు. అంతేకాక పర్స్‌లో ఉన్న 40 డాలర్లకు మరో 60 డాలర్లను కలిపి మొత్తం 100 డాలర్లను హంటర్‌కిచ్చాడు. పర్స్ దొరికినందుకు గాను పార్టీ చేసుకునేదకు నేను మరి కొంత సొమ్మును ఇందులో ఉంచుతున్నానంటూ తెలిపాడు సదరు వ్యక్తి.
పార్శల్‌ని చూసిన హంటర్ తొలుత నమ్మలేదు. కానీ తరువాతం సంతోషంతో ఉప్పొంగిపోయాడు. తనకు పార్శల్ పంపిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు హంటర్ ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది. దాంతో తమకు సాయం చేసిన మంచి వ్యక్తి గురించి నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు హంటర్ తల్లి. దాంతో ఈ విషయం కాస్తా వైరల్ అవ్వడమే కాక.. సదరు ఆగంతకుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment