అమెరికాలో హైదరాబాద్‌ యువకుడిపై కాల్పులు | Hyderabad Student injured in US Firing | Sakshi
Sakshi News home page

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడిపై కాల్పులు

Published Mon, Dec 11 2017 1:43 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

Hyderabad Student injured in US Firing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలోని షికాగోలో ఉన్నతవిద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అక్బర్‌ (30) కొందరు గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుడి దవడలోకి ఓ తూటా దూసుకుపోవడంతో కుప్పకూలిపోయాడు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు అక్బర్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. షికాగోలోని డివ్రై యూనివర్సిటీలో మాస్టర్‌ ఇన్‌ కంప్యూటర్‌ సిస్టమ్స్‌ నెట్‌వర్కింగ్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ చదివేందుకు మూడేళ్ల కిందట అమెరికా వెళ్లిన అక్బర్‌ మరో మూడు నెలల్లో కోర్సు పూర్తి చేసుకొని హైదరాబాద్‌ రావాల్సి ఉంది. ఈ నెల 5న అక్బర్‌ తన కారును పార్కింగ్‌ చేస్తుండగా అతనిపై కాల్పులు జరిగాయి. షికాగోలోనే ఉంటున్న అక్బర్‌ స్నేహితుడు, హైదరాబాద్‌కే చెందిన అశ్వక్‌కు పోలీసులు ఈ సమాచారం అందించగా అతను ఈ విషయాన్ని అక్బర్‌ తల్లిదండ్రులకు 6న తెలియజేశాడు. 

అత్యవసర వీసా ఇప్పించరూ.. 
హోంమంత్రికి అక్బర్‌ తండ్రి విజ్ఞప్తి 
కాల్పుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తమ కుమారుడిని చూసేందుకు వెంటనే అమెరికా వీసా ఇప్పించాలంటూ అక్బర్‌ తండ్రి యూసఫ్‌ ఆదివారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. దీంతో వెంటనే స్పందించిన నాయిని...విదేశాంగశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. అక్బర్‌ కుటుంబ సభ్యులకు అత్యవసర వీసా మంజూరు కోసం ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ విషయంలో అవసరమైన సాయం చేస్తామని హోంమంత్రి తమకు హామీ ఇచ్చినట్లు యూసఫ్‌ మీడియాకు తెలిపారు. మల్లాపూర్‌ అన్నపూర్ణ కాలనీలోని డైమండ్‌ ఎన్‌క్లేవ్‌లో యూసఫ్‌ కుటుంబం నివసిస్తోంది. యూసఫ్‌ ఆరుగురు కుమారుల్లో అక్బర్‌ నాలుగోవాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement