
నాన్న.. దివి నుండి దిగిరావా?
ఆ పిల్లాడిది అమాయకత్వమో...
తిరిగిరాని లోకాలకు వెళ్లిన తండ్రే..
తన కోరికలన్నీ తీరుస్తాడనే
నమ్మకమో.. లేక.. ఎవరినడగాలో
తెలియని నిస్సాహయతో...
క్రిస్మస్ బహుమతుల కోసం
తండ్రికి లేఖ రాశాడు..
స్వర్గంలో ఉన్న తండ్రికి పంపేందుకు
దానికి ఓ బెలూన్ కట్టాడు..
నాన్నకు చేరని ఆ లేఖ.. ఇప్పుడు
ఎంతోమంది కన్న తండ్రులను కన్నీరు పెట్టిస్తోంది.
బహుమతులిచ్చి ఆ పిల్లాడిని ఊరుకోబెడదామంటే..
పిల్లాడు లేడు.. లేఖ మాత్రమే ఉంది.
ఫొటోగ్రాఫర్ మెక్‌కోల్ స్నేహితులతో కలిసి బల్ములే ప్రాంతంలోని ఓ ఫోర్‌స్టార్ హోటల్ సమీపంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దూరంగా ఓ బెలూన్ మెరుస్తూ కనిపించింది. దగ్గరికెళ్లి చూస్తే దానికో పేపర్ కట్టి ఉంది. అందులో ఏవో బొమ్మలు.. ఇంకేదో రాసి ఉంది. చదివితే.. ఓ పిల్లాడు తన తండ్రికి రాసిన లెటర్ అది. దానిని చదివిన మెక్‌కోల్ కళ్లు చెమర్చాయి. గుండె కరిగిపోయింది. రెండు పెదాలను పళ్లకింద అదిపెడుతూ.. గుండెలో నుంచి వస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఆ బాధ కళ్లల్లో నుంచి కన్నీరుగా బయటకు వచ్చేస్తోంది. స్నేహితులు దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. వారంతా లేఖ చదివారు. వారిదీ అదే పరిస్థితి. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే...
‘హాయ్ డాడ్... నిన్ను చాలా మిస్సవుతున్నానని చెప్పేందుకే ఈ లేఖ రాస్తున్నా. నాకు బాధేస్తుందనే విషయం నీకు తెలుసు. అమ్మ కూడా జ్వరమొచ్చినప్పుడు ఎలా ఉంటుందో.. అలాగే ఉంది. రేపు మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం. స్కూల్‌ను, నిన్ను నిజంగానే మిస్సవుతున్నా. నాకు తెలుసు పైనున్న స్వర్గంలో నువ్వు క్షేమంగా ఉన్నావని. అందుకే ఇక్కడి నుంచి వెళ్లేముందు నాకు క్రిస్మస్ బహుమతులుగా ఏమేం కావాలో ఓ లిస్ట్ రాసి నీకు పంపుతున్నా. నా కలలన్నీ నీ గురించే.. నా ఆలోచనలు, ఆశలన్నీ నీ గురించే.. నా నమ్మకం నీపైనే. అందుకే ఈ లెటర్ నీకు పంపుతున్నా.
ఇది నా క్రిస్మస్ బహుమతుల జాబితా: బూట్లు, స్టడ్స్, రీబౌండర్ నెట్, న్యూ ప్రీమియర్ లీగ్ బాల్, రియల్ మాడ్రిడ్ జెర్సీ, షార్ట్స్, రుబిక్స్ క్యూబ్. ..బై బై డాడీ. లవ్ యూ.
‘లేఖను చదివిన తర్వాత నాకు ఏడుపు ఆగలేదు. అలాగే ఇంటకెళ్లిపోయా. ఆలోచిస్తూ కూర్చున్నా. కనీసం సోషల్ మీడియాలో వివరాలను పోస్ట్ చేస్తే ఆ పిల్లాడి ఆచూకీ తెలుస్తుందని, ఎక్కడున్నా నేనే స్వయంగా వెళ్లి బహుమతులు అందజేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రిస్మస్‌కు జీసస్‌ను ఒకటే కోరుతున్నా... ఎవరి ద్వారానైనా ఆ పిల్లాడి ఆచూకీ తెలియాలి. నేను బహుమతులు అందజేయాలి’ – మెక్‌కోల్