భార్యకు సారీ చెప్పలేదు.. ఎందుకంటే!
లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన ఘట్టం ఫైనల్ రౌండ్, థర్డ్ డిబేట్ హోరాహోరీగా సాగింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్లు ఈ బిగ్ డిబేట్లో ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. మహిళలతో అసభ్య ప్రవర్తనపై, రష్యాకు అనుకూల వైఖరిపై హిల్లరీ క్లింటన్ ప్రశ్నించి ట్రంప్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే తనపై వచ్చిన తొమ్మిది లైంగిక వేధింపుల ఆరోపణలను ట్రంప్ ఈ సందర్భంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పుడు చర్యలకు పాల్పడలేదని చెబుతూనే, అసలు ఇందుకు సంబంధించి తన భార్య మిలానియా ట్రంప్ కు ఎప్పుడూ క్షమాపణలు కూడా చెప్పలేదని వెల్లడించారు.
అధ్యక్ష ఎన్నికల కోసం హిల్లరీతో కలిసి క్యాంపెన్ ఈవెంట్లో పాల్గొంటున్న మహిళలు ఆమె కోసం పనిచేయడం లేదని, కేవలం పది నిమిషాల పాటు తమ పేరు హైలెట్ కావాలనుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. తనకంటే మహిళలను మరెవరూ అంతగా గౌరవించరని చెప్పారు. 2005లో జరిగిన కొన్ని ఘటనలలో మహిళలపై ట్రంప్ చేసిన అసభ్యవ్యాఖ్యల వీడియో పెనుదుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.
దీంతో పాటుగా సొంత కూతురు ఇవాంక కొన్నేళ్ల తర్వాత పుట్టి ఉంటే ఆమెతో డేటింగ్ చేసేవాడినని గతంలో ఓ షోలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అమెరికాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తన భర్త ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చిందని, ఈ విషయంపై ట్రంప్ తనను క్షమాపణ అడిగారని కొన్ని రోజుల కిందట మెలానియా ట్రంప్ మీడియాకు వెల్లడించడం గమనార్హం. వచ్చే నవంబర్ 8న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు.