ఇస్లామాబాద్: భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలపై వివాదానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెరదించారు. తాను మన్మోహన్‌ను ఎన్నడూ గ్రామీణ మహిళ (దెహతీ ఔరత్) అని అనలేదని లండన్‌లో విలేకర్లతో అన్నారు. ఈమేరకు పాక్ పత్రికలు మంగళవారం వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ సందర్భంగా మన్మోహన్ పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పిన నేపథ్యంలో.. నవాజ్ ఓ ఇంటర్వ్యూలో మన్మోహన్ గ్రామీణ మహిళలా ఫిర్యాదు చేశారని అన్నట్లు వార్తలు రావడం తెలిసిందే.
నవాజ్ ఈ మాట అన్నారని చెప్పిన పాక్ జర్నలిస్టు హమీద్ మీర్.. వివాదం రేగడంతో ఆయన అలా అనేలేదని వివరణ ఇచ్చారు. కాగా, ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా మన్మోహన్‌తో జరిపిన భేటీ సంతృప్తికరంగా సాగిందని నవాజ్ చెప్పారు. కాశ్మీర్, సియాచిన్ వంటి అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల కోసం వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరముందన్నారు. తమ దేశంలో సాగుతున్న ఉగ్రవాద చర్యల వెనుక బయటి శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు. పాక్, భారత్‌లు పేదరికం, వెనుకబాటుతనం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు.