డోనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు)
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఎంత క్రియాశీలంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద విషయాన్ని గుర్తు చేస్తూ, తానే కొత్తగా వివాదాలు రేపుతూ ఎప్పుడూ సోషల్ మీడియా ప్రపంచంలో ఉంటుంటారు. అలాంటి ఆయన తన వ్యక్తిగత విషయాలు కొన్ని తనన ఇంటర్వ్యూ చేసిన ఓ బ్రిటన్ టీవీ చానల్ ఐటీవీతో పంచుకున్నారు. తాను ఒక్కోసారి మంచంపై నుంచి లేవకుండానే ట్వీట్లు చేస్తుంటానని, తాను ఎప్పుడు ఏ ట్వీట్ చేస్తానా అని ప్రపంచమంతా ఎదురుచూస్తుంటుందని ఆయన చెప్పారు.
ట్రంప్ ట్విటర్ ఖాతాకు దాదాపు 47.2మిలియన్ల మంది యూజర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సదరు టీవీ చానెల్ ప్రశ్నించగా ట్విటర్‌లో తన పోస్టింగ్‌లు పెద్ద మొత్తంలో ప్రభావం చూపిస్తుండటంపై తనను తాను మెచ్చుకుంటున్నానని అన్నారు. తాను తన ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు కచ్చితంగా సోషల్ మీడియానే ఆశ్రయిస్తుంటానని, లేదంటే నా గురించి జరిగే దుష్ప్రచారం తన ప్రజలకు తెలియకుండా పోతుందని అభిప్రాయపడ్డారు. నిత్యం సోషల్ మీడియాలో, ఇతర మీడియా సంస్థల్లో తన గురించి చెడు ప్రచారం జరుగుతుంటుందని, దానిని అడ్డుకుని తీరేందుకు, వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు తాను సోషల్ మీడియానే ఉపయోగిస్తుంటానని, తన ట్వీట్‌లకోసం మొత్తం ప్రపంచం ఎదురుచూస్తుంటుందని అన్నారు.
నిద్రపోయేటప్పుడు కూడా తనతోపాటే ఫోన్ పక్కన పెట్టుకుంటారా అనే విషయం ప్రశ్నించగా తాను బెడ్‌పై నుంచే పోస్టింగ్స్ చేస్తానని, అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాల్లో కూడా చేస్తానని, తాను తీరిక లేకుండా గడపడం వల్లే అలా చేయాల్సి వస్తుందని అన్నారు. ఇక భోజనం విషయంపై స్పందిస్తూ తాను ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పిన ట్రంప్ ప్రపంచంలోనే మేటి అయిన చెఫ్‌లు తయారు చేసిన వంటకాలు తింటానని, ఆరోగ్యవంతమైన ఆహారాన్నే తీసుకుంటానని, అందుకే యాక్టివ్‌గా ఉంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment