నేను టెర్రరిస్టును కానే కాను | iam not a terrorist, says woman in photos | Sakshi
Sakshi News home page

నేను టెర్రరిస్టును కానే కాను

Published Thu, Nov 26 2015 7:35 PM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

నేను టెర్రరిస్టును కానే కాను - Sakshi

నేను టెర్రరిస్టును కానే కాను

ఫ్రాన్స్ మీద జరిగిన ఉగ్రదాడుల్లో ఓ మహిళా ఆత్మాహుతి బాంబర్ ఉందని, ఆమె అత్యంత విలాసవంతమైన జీవితం గడిపేదంటూ నిన్న మొన్నటివరకు కొన్ని ఫొటోలు హల్‌చల్ చేశాయి. బాత్‌టబ్‌లో స్నానం చేసిన ఫొటోలు కూడా బయటపడ్డాయి. ఆమె సిగరెట్లు తాగేదని, అస్సలు ఖురాన్ పఠించేది కాదని.. ఇలా రక రకాల వాదనలు వచ్చాయి. అయితే, అసలు తాను ఉగ్రవాదినే కానని, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తానని ఆ మహిల చెబుతోంది. తాను బతికే ఉన్నానంటూ తన ఫొటోలను తప్పుగా ప్రచురించారని చెబుతోంది.

'నేను నిర్దోషిని నాకే పాపం తెలియదు. నేను టెర్రరిస్టును కాదు. పైగా టెర్రరిస్టులను వ్యతిరేకిస్తాను. అహింసను కోరుకుంటాను. పారిస్‌లో ఇటీవల ఆత్మాహుతి బాంబు పేల్చుకున్న హస్మా అయిత్ బౌలాచెన్‌ను అంతకన్నా కాదు. ఆమె పేరిట ప్రచురించిన ఫొటోలు మాత్రం నావే. టబ్‌లో స్నానం చేస్తున్న ఆ ఫొటో నాదే. ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైన ఆ ఫొటోలు నా జీవితాన్నే తలకిందులు చేశాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాకు నిద్ర లేదు. తిన్నానో, లేదో కూడా తెలియదు. ఇంటి బయటకెళ్తే ఛీత్కారాలు, శాపనార్థాలు ఎదుర్కొంటున్నాను. ఫొటోల కారణంగా చేస్తున్న ఉద్యోగం కాస్తా ఊడిపోయింది. నాకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారినెలా పోషించాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాను. దిక్కుతోచడం లేదు. నా పేరు నబిలా బొకాచ. మొరాకోలోని బెని మెల్లాల్  నుంచి టీనేజ్‌లోనే పారిస్‌కు వచ్చాను. నేను టెర్రరిస్టును కాదని చెప్పడం నా బాధ్యత, నా అవసరం. ప్రపంచం ఈ విషయాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాను' అని వాపోతోంది ఈ యువతి.

ఆత్మాహుతి బాంబర్ బౌలాచెన్ ఈమెనంటూ ముందుగా అరబ్ పత్రికలు కొన్ని ఫొటోలను ప్రచురించాయి. నిజమేననుకున్న పలు పత్రికలు, వెబ్‌సైట్లు అవే ఫొటోలను ప్రచురించాయి. ఎన్నడూ ఖురాన్‌ను కూడా చదవని ఈ టెర్రరిస్టు విలాసాల కులాసా జీవితాన్ని గడిపారని, పబ్బులకు, బార్లకు తెగ తిరిగేదంటూ పలు కథనాలతో కొన్ని పత్రికలు ఆమె బాత్ టబ్‌లో స్నానం చేస్తున్న దృశ్యాలను కూడా ప్రచురించాయి.

ప్రపంచాన్ని విస్మయపరిచిన ఈ ఫొటోలను తన మిత్రులే తీశారని, వారిలో ఒకరు ఈ ఫొటోలను బయట ప్రపంచానికి విడుదల చేసి ఇప్పుడు తన జీవితం నాశనం కావడానికి కారకులయ్యారని బొకాచ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఫొటోల ప్రతులు కూడా తనవద్ద లేవని చెప్పింది. ఈ మేరకు పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. పోలీసుల వద్దకెళ్లి తన మొర వినిపించుకొంది. ఇలా నష్టపోయిన తన జీవితానికి ఎలా పరిహారం కడతారని ప్రపంచాన్ని ప్రశ్నిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement