Paris Terror Attacks
-
నేను టెర్రరిస్టును కానే కాను
ఫ్రాన్స్ మీద జరిగిన ఉగ్రదాడుల్లో ఓ మహిళా ఆత్మాహుతి బాంబర్ ఉందని, ఆమె అత్యంత విలాసవంతమైన జీవితం గడిపేదంటూ నిన్న మొన్నటివరకు కొన్ని ఫొటోలు హల్చల్ చేశాయి. బాత్‌టబ్‌లో స్నానం చేసిన ఫొటోలు కూడా బయటపడ్డాయి. ఆమె సిగరెట్లు తాగేదని, అస్సలు ఖురాన్ పఠించేది కాదని.. ఇలా రక రకాల వాదనలు వచ్చాయి. అయితే, అసలు తాను ఉగ్రవాదినే కానని, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తానని ఆ మహిల చెబుతోంది. తాను బతికే ఉన్నానంటూ తన ఫొటోలను తప్పుగా ప్రచురించారని చెబుతోంది. 'నేను నిర్దోషిని నాకే పాపం తెలియదు. నేను టెర్రరిస్టును కాదు. పైగా టెర్రరిస్టులను వ్యతిరేకిస్తాను. అహింసను కోరుకుంటాను. పారిస్‌లో ఇటీవల ఆత్మాహుతి బాంబు పేల్చుకున్న హస్మా అయిత్ బౌలాచెన్ను అంతకన్నా కాదు. ఆమె పేరిట ప్రచురించిన ఫొటోలు మాత్రం నావే. టబ్‌లో స్నానం చేస్తున్న ఆ ఫొటో నాదే. ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైన ఆ ఫొటోలు నా జీవితాన్నే తలకిందులు చేశాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాకు నిద్ర లేదు. తిన్నానో, లేదో కూడా తెలియదు. ఇంటి బయటకెళ్తే ఛీత్కారాలు, శాపనార్థాలు ఎదుర్కొంటున్నాను. ఫొటోల కారణంగా చేస్తున్న ఉద్యోగం కాస్తా ఊడిపోయింది. నాకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారినెలా పోషించాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాను. దిక్కుతోచడం లేదు. నా పేరు నబిలా బొకాచ. మొరాకోలోని బెని మెల్లాల్ నుంచి టీనేజ్లోనే పారిస్‌కు వచ్చాను. నేను టెర్రరిస్టును కాదని చెప్పడం నా బాధ్యత, నా అవసరం. ప్రపంచం ఈ విషయాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాను' అని వాపోతోంది ఈ యువతి. ఆత్మాహుతి బాంబర్ బౌలాచెన్ ఈమెనంటూ ముందుగా అరబ్ పత్రికలు కొన్ని ఫొటోలను ప్రచురించాయి. నిజమేననుకున్న పలు పత్రికలు, వెబ్సైట్లు అవే ఫొటోలను ప్రచురించాయి. ఎన్నడూ ఖురాన్‌ను కూడా చదవని ఈ టెర్రరిస్టు విలాసాల కులాసా జీవితాన్ని గడిపారని, పబ్బులకు, బార్లకు తెగ తిరిగేదంటూ పలు కథనాలతో కొన్ని పత్రికలు ఆమె బాత్ టబ్‌లో స్నానం చేస్తున్న దృశ్యాలను కూడా ప్రచురించాయి. ప్రపంచాన్ని విస్మయపరిచిన ఈ ఫొటోలను తన మిత్రులే తీశారని, వారిలో ఒకరు ఈ ఫొటోలను బయట ప్రపంచానికి విడుదల చేసి ఇప్పుడు తన జీవితం నాశనం కావడానికి కారకులయ్యారని బొకాచ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఫొటోల ప్రతులు కూడా తనవద్ద లేవని చెప్పింది. ఈ మేరకు పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. పోలీసుల వద్దకెళ్లి తన మొర వినిపించుకొంది. ఇలా నష్టపోయిన తన జీవితానికి ఎలా పరిహారం కడతారని ప్రపంచాన్ని ప్రశ్నిస్తోంది. -
భారత్‌లో ఐఎస్ఐఎస్ ముప్పు!
న్యూఢిల్లీ: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థపై ఫ్రాన్స్ ప్రకటించిన యుద్ధానికి భారత్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నుంచి దేశానికి మరింత ముప్పు పొంచి ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. పారిస్ స్థాయి నగరంలోనే అసాధారణస్థాయి దాడులతో ఇస్లామిక్ స్టేట్ విరుచుకుపడిన నేపథ్యంలో దాని నుంచి పొంచి ఉన్న ముప్పును మరోసారి సమీక్షించాలని భారత భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. పారిస్ దాడుల అనంతరం ఐఎస్ఐఎస్ నుంచి పొంచి ముప్పును హైలెవల్‌గా భావిస్తున్నామని, అదేవిధంగా దేశంలో దాని కార్యకలాపాలను నిరోధించేందుకు కౌంటర్ వ్యూహాన్ని తీసుకురావావాలని అనుకుంటున్నామని నిఘా వర్గాలు తెలిపాయి. యూరప్‌లోనే అత్యంత కీలకమైన నగరం, అత్యంత భద్రత ఉండే ప్రదేశమైన పారిస్‌లోనే భారీ దాడులు నిర్వహించడంతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బలం, ఆత్మవిశ్వాసం పుంజుకునే అవకాశముందని, ఈ నేపథ్యంలో సహజంగానే మరిన్ని భారీ దాడులకు పాల్పడేందుకు అది ప్రయత్నిస్తుందని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు. ఏ నగరాన్నైనా ఐఎస్ఐఎస్ ఇప్పుడు లక్ష్యంగా చేసుకోగలదని, ఈ నేపథ్యంలో ముందుగానే ఈ ముప్పు గుర్తించి దానికి అనుగుణమైన భద్రతా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఐఎస్ఐఎస్ను ఎదుర్కోవడంలో ఫ్రాన్స్‌కు పూర్తి సహకారమందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సోమవారం ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఐఎస్ఐఎస్పై పోరులో ఫ్రాన్స్‌కు భారత్ ఏ తరహా సాయం అందిస్తుందనే దానిపై ఇంకా ఒక స్పష్టత రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. -
కిటికీకి వేలాడి.. ప్రాణాలు నిలుపుకొన్న గర్భిణి!
పారిస్: 'రక్షించండి.. రక్షించండి.. నేను గర్భవతిని'- బాటాక్లాన్ థియేటర్ వద్ద రెండో అంతస్తు కిటికీకి వేలాడుతూ ఓ మహిళ చేసిన ఆర్తనాదం ఇది. అప్పటికే బాటాక్లాన్ థియేటర్ ఉగ్రవాదుల కాల్పులతో దద్దరిల్లుతున్నది. విచక్షణరహితంగా ముష్కరులు కురిపించిన తూటాల వర్షంతో పదులసంఖ్యలో జనం నేలకూలారు. మిగిలినవారు ప్రాణభయంతో ఆర్తనాదాలుచేస్తూ.. తప్పించుకునేందుకు తలోదిక్కు పరుగులు పెట్టారు. ఇలాంటి భయానక సమయంలో థియేటర్ వెనుకద్వారం నుంచి పదులసంఖ్యలో బయటకు పరుగులు తీస్తుండగా.. ఓ మహిళ రెండో అంతస్తు కిటికి అంచులను పట్టుకొని.. సాయం కోసం అర్థించింది. అత్యంత నాటకీయ, ఉత్కంఠ పరిణామాల మధ్య ఆ గర్భిణి ప్రాణాలను దక్కించుకుంది. ఓ సాహసి అక్కడికి వచ్చి ఆమెను పైకి లాగడంతో బతికి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. థియేటర్‌కు అభిముఖంగా ఉన్న భవనంలో ఉంటున్న జర్నలిస్టు డానియెల్ సెన్నీ ఈ ఘటనను వీడియో తీశారు. అప్పటివరకు సంగీతంతో హోరెత్తిన బాటాక్లాన్ థియేటర్లో ఉగ్రవాదులు విచ్చలవిడిగా తెగబడటంతో 80 మంది మృత్యువాతపడ్డారు. ఇంకా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులతో థియేటర్ యుద్ధభూమిగా మారిపోయి రక్తపుచారికలో భీతావహంగా మారిపోయింది. ఆ సమయంలో చాలామంది థియేటర్ నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. ఆ సమయంలో ఈ వీడియో తీసిన జర్నలిస్టు సెన్నీకి కూడా బుల్లెట్ గాయమైంది. వీడయో తీస్తుండగా ఉగ్రవాదుల బుల్లెట్ ఆయన భుజానికి తాకింది. -
ఇది ఆరంభం మాత్రమే!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో తాము తలపెట్టిన భారీ నరమేధం ఆరంభం మాత్రమేనని, మున్మందు మరిన్ని దాడులు చేస్తామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పారిస్‌లో అత్యంత పకడ్బందీగా జరిగిన ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లకు తనదే బాధ్యత అని పేర్కొంది. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగానే పారిస్‌లో ఈ భయానక దాడులకు వ్యూహరచన చేశామని ఇస్లామిక్ స్టేట్ తెలిపింది. తమ ఆధీనంలో ఉన్న ఇరాక్, సిరియాలో వైమానిక దాడులకు పాల్పడుతుండటం కూడా పారిస్‌లో దాడులకు కారణమని శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సంకేతాలు ఇచ్చింది. పారిస్ నిండా విషాదఛాయలు కనీవినీ ఎరుగని ఉగ్రవాద నరమేధంతో భీతిల్లిన పారిస్‌లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తోబుట్టువులను, బంధువులను, కుటుంబసభ్యులను పొగొట్టుకున్నవారిన రోదనలు మిన్నంటాయి. విచ్చలవిడిగా కాల్పులు, బాంబు దాడులతో దద్దరిల్లిన పారిస్‌లో 127 మంది చనిపోయారు. 300మందికిపైగా క్షతగాత్రులయ్యారు. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం పారిస్ వాసులు పుష్పగుచ్ఛాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఎనిమిది మంది ముష్కరులు కాల్పులతో చెలరేగడం వల్ల వందమందికిపైగా చనిపోయిన బాటాక్లాన్ కాన్సర్ట్ హాల్ వద్ద ఓ సంగీతకళాకారుడు పియానో వాయిస్తూ మృతులకు నివాళులర్పించారు. మరోవైపు దాడులకు దిగిన ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. -
మనవాళ్లంతా క్షేమంగానే ఉన్నారు!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాదులు తలపెట్టిన నరమేధంలో భారతీయులు ఎవరూ చనిపోలేదని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. పారిస్‌లో ఉంటున్న ప్రవాస భారతీయులు అందరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందిందని చెప్పారు. 'ఫ్రాన్స్‌లోని భారత రాయబారితో మాట్లాడాను. భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సమయంలో పౌరులంతా ఇళ్లలోనే ఉండాలని ఫ్రాన్స్ ప్రభుత్వం సూచించింది' అని ఆమె శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో పాల్గొనేందుకు సుష్మా స్వరాజ్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు. పారిస్‌లో విచ్చలవిడిగా తెగబడిన ఉగ్రవాదులు 127మందికిపైగా ప్రజలను పొట్టనబెట్టుకున్నారు. ఈ నరమేధంలో 200మందికిపైగా గాయపడ్డారు. 2008 ముంబై దాడులను తలపించేలా పారిస్ నగరంలో సాగిన ఈ మారణకాండతో ఫ్రాన్స్‌తో పాటు యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. -
'మిమ్మల్ని ఏమాత్రం నిశ్చింతగా ఉండనివ్వం'
కైరో: పారిస్‌లో జరిగిన భయానక ఉగ్రవాద దాడులు, సాయుధ కాల్పులకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధికారికంగా ప్రకటించింది. పారిస్‌లోని జాతీయ క్రీడా మైదానం, ఓ సంగీత విభావరి, రెస్టారెంట్లు హోటళ్ల వద్ద జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 128 మంది చనిపోయారు. ఈ ఘటనను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే తమ దేశంపై యుద్ధంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ విదేశీ మీడియా విభాగం అల్ హయత్ మీడియా సెంటర్ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో ఫ్రాన్‌లో దాడులు జరుపాల్సిందిగా అక్కడి ముస్లింలకు పిలుపునిచ్చింది. సిరియాలోని తమ ఫైటర్లపై వైమానిక దాడులు ఆపనంతకాలం ఫ్రాన్స్‌పై దాడులు చేస్తూనే ఉంటామని ప్రకటించింది. 'మీరు మాపై బాంబు దాడులకు పాల్పడుతున్నంతకాలం.. మీరు నిశ్చింతగా ఉండలేరు. మీరు మార్కెట్‌కు వెళ్లాలన్న భయపడే పరిస్థితులు వస్తాయి' అని ఈ వీడియోలో ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. ఇది అయితే తాజా వీడియోనా? లేక పాతదా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది.