మనవాళ్లంతా క్షేమంగానే ఉన్నారు!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాదులు తలపెట్టిన నరమేధంలో భారతీయులు ఎవరూ చనిపోలేదని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. పారిస్‌లో ఉంటున్న ప్రవాస భారతీయులు అందరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందిందని చెప్పారు. 'ఫ్రాన్స్‌లోని భారత రాయబారితో మాట్లాడాను. భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సమయంలో పౌరులంతా ఇళ్లలోనే ఉండాలని ఫ్రాన్స్ ప్రభుత్వం సూచించింది' అని ఆమె శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో పాల్గొనేందుకు సుష్మా స్వరాజ్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు.
పారిస్‌లో విచ్చలవిడిగా తెగబడిన ఉగ్రవాదులు 127మందికిపైగా ప్రజలను పొట్టనబెట్టుకున్నారు. ఈ నరమేధంలో 200మందికిపైగా గాయపడ్డారు. 2008 ముంబై దాడులను తలపించేలా పారిస్ నగరంలో సాగిన ఈ మారణకాండతో ఫ్రాన్స్‌తో పాటు యావత్ ప్రపంచం నివ్వెరబోయింది.