జాడ తెలిసింది.. క్షేమంగా తెస్తాం | we know where indians are, says sushma swaraj | Sakshi
Sakshi News home page

జాడ తెలిసింది.. క్షేమంగా తెస్తాం

Published Fri, Jun 20 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

we know where indians are, says sushma swaraj

* ఇరాక్‌లో కిడ్నాపైన భారతీయులపై కేంద్రం హామీ   
* పరిస్థితిని సమీక్షిస్తున్న సుష్మాస్వరాజ్


న్యూఢిల్లీ: ఇరాక్‌లోని మోసుల్ పట్టణంలో సున్నీ తిరుగుబాటుదారుల చేతిలో అపహరణకు గురైన 40 మంది భారతీయుల ఆచూకీ తెలిసిందని, వారంతా క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం ప్రకటించారు. ఒక కాటన్ మిల్లులోను, మరో ప్రభుత్వ భవనంలోనూ వారిని ఉంచారని తెలిపారు. కిడ్నాప్‌కు గురైన వారి కుటుంబసభ్యులతో కలిసి పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ గురువారం సుష్మాస్వరాజ్‌తో సమావేశమైన సందర్భంలో సుష్మా ఈ విషయం చెప్పారని బాదల్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అపహరణకు గురైన వారిని సురక్షితంగా తెచ్చేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని సుష్మ మీడియాకు తెలిపారు. కాగా, ఇరాక్‌లో కిడ్నాపైన భారతీయులు సురక్షితంగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ప్రధాని మోడీకి గురువారం లేఖ రాశారు.
 
 ప్రభుత్వ ఖర్చుతో భారత్‌కు..!
 కిడ్నాపైన వారు పంజాబ్ సహ ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి తారిఖ్ నూర్ అల్ హుడా అనే నిర్మాణ సంస్థ తరఫున ఇరాక్ వెళ్లారు. కిడ్నాపైన వారితో సహా ఇరాక్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 120 మంది భారతీయులు ఉన్నారని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సుష్మాస్వరాజ్ గురువారం సంక్షోభ నిర్వహణ బృందాలతో రెండు దఫాలు చర్చలు జరిపారు. కిడ్నాపైన భారతీయులు క్షేమంగా ఉన్నారని, వారిని సురక్షితంగా వెనక్కుతీసుకువచ్చే ఏ అవకాశాన్ని వదలబోమని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు.

వారితోపాటు, ఇరాక్‌లోని హింసాత్మక ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరినీ, అక్కడ పరిస్థితి చక్కపడగానే తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇరాక్‌లో సాధారణ పరిస్థితులున్న ప్రాంతం నుంచి కూడా ఎవరైనా భారతీయులు ఇండియాకు రావాలనుకుంటే వారిని కూడా ప్రభుత్వ ఖర్చుతో తీసుకువస్తామన్నారు. పరిస్థితిని తాను స్వయంగా సమీక్షిస్తున్నానని సుష్మా తెలిపారు. ఇరాక్‌లో దాదాపు 20 వేలమంది భారతీయులున్నారని ఆమె వెల్లడించారు. వారెవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని సుష్మా సూచించారు. ఇరాక్‌లోని ఒక ఆసుపత్రిలో చిక్కుకుపోయిన కేరళకు చెందిన 45 మంది నర్సులు సురక్షితంగా ఉన్నారన్నారు.  కాగా, పరిస్థితిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఇరాక్‌లో భారత రాయబారిగా పనిచేసిన సురేశ్ రెడ్డి బాగ్దాద్ వెళ్లి, అక్కడి అధికారులతో చర్చలు జరిపారు.
 
 9వ రోజుకు అంతర్యుద్ధం: ఇరాక్‌లో అంతర్యుద్ధం గురువారానికి 9వ రోజుకు చేరింది. పలు ప్రాంతాల్లో సున్నీ తిరుగుబాటుదారులకు, ప్రభుత్వ సాయుధ బలగాలకు మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇప్పటికే వందలాది మంది చనిపోగా, హింసాత్మక ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. బాగ్దాద్ దిశగా దూసుకొస్తున్న సున్నీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేయాలన్న ఇరాక్ అభ్యర్థనపై అమెరికా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వైమానిక దాడుల రూపంలో చేసిన సహాయానికి ప్రతిగా ప్రధాని పదవికి రాజీనామా చేయమంటే.. ఆ డిమాండ్‌కు తలొగ్గబోనని ఇరాక్ ప్రధానమంత్రి నౌరి అల్ మాలికి  స్పష్టం చేశారు. మాలికిని రాజీనామా చేయాల్సిందిగా కోరాలని ఒబామాపై అమెరికాలోని సీనియర్ నేతల ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో మాలికి పై వ్యాఖ్య చేశారు. ఇరాకీ సైన్యానికి శిక్షణనిచ్చేందుకు అమెరికా కోట్లాది డాలర్లను ఖర్చు చేసింది. అయినా, సున్నీ జీహాదీలను వారు సమర్థంగా ఎదుర్కోలేకపోతుండటం గమనార్హం. రెబల్స్‌ను చూడగానే భద్రతదళాలు యూనీఫామ్‌లను, ఆయుధాలను, వాహనాలను వదిలేసి పారిపోతున్నారు. కాగా, అవసరమైతే ఇరాక్‌లో నిర్దేశిత లక్ష్యాలపై సైనికచర్యకు సిద్ధంగా ఉన్నామని  ఒబామా ప్రకటించారు. ఇరాక్‌కు పంపించేందుకు 300 మంది సైనిక సలహాదారులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement