ఇది ఆరంభం మాత్రమే!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో తాము తలపెట్టిన భారీ నరమేధం ఆరంభం మాత్రమేనని, మున్మందు మరిన్ని దాడులు చేస్తామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పారిస్‌లో అత్యంత పకడ్బందీగా జరిగిన ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లకు తనదే బాధ్యత అని పేర్కొంది. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగానే పారిస్‌లో ఈ భయానక దాడులకు వ్యూహరచన చేశామని ఇస్లామిక్ స్టేట్ తెలిపింది. తమ ఆధీనంలో ఉన్న ఇరాక్, సిరియాలో వైమానిక దాడులకు పాల్పడుతుండటం కూడా పారిస్‌లో దాడులకు కారణమని శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సంకేతాలు ఇచ్చింది.
పారిస్ నిండా విషాదఛాయలు
కనీవినీ ఎరుగని ఉగ్రవాద నరమేధంతో భీతిల్లిన పారిస్‌లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తోబుట్టువులను, బంధువులను, కుటుంబసభ్యులను పొగొట్టుకున్నవారిన రోదనలు మిన్నంటాయి. విచ్చలవిడిగా కాల్పులు, బాంబు దాడులతో దద్దరిల్లిన పారిస్‌లో 127 మంది చనిపోయారు. 300మందికిపైగా క్షతగాత్రులయ్యారు. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం పారిస్ వాసులు పుష్పగుచ్ఛాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఎనిమిది మంది ముష్కరులు కాల్పులతో చెలరేగడం వల్ల వందమందికిపైగా చనిపోయిన బాటాక్లాన్ కాన్సర్ట్ హాల్ వద్ద ఓ సంగీతకళాకారుడు పియానో వాయిస్తూ మృతులకు నివాళులర్పించారు. మరోవైపు దాడులకు దిగిన ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు పోలీసులు తెలిపారు.