ఆ కారులో ఏకే-47 తుపాకులు!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాదులు తలపెట్టిన నరమేధంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. టర్కీలో జరుగనున్న జీ20 సదస్సులో ఆర్థిక అజెండా కంటే ఉగ్రవాదంపై పోరుకే పెద్దపీట వేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ నరమేధానికి కారకులైనవారి పూర్తి వివరాలు శరవేగంగా వెలుగులోకి తెచ్చేందుకు ఫ్రాన్స్ పోలీసు, దర్యాప్తు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని తూర్పు మాంట్రియల్ పట్టణంలోని ఉగ్రవాదులు ఉపయోగించిన నల్లరంగు కారును పోలీసులు కనుగొన్నారు. ఈ వాహనంలో ప్రయాణించిన ఉగ్రవాదులు పారిస్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద కాల్పులు జరిపి.. పలువురి ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు.
ఈ కారులో కొన్ని ఏకే-47 తుపాకులు లభించాయి. దీనినిబట్టి నరమేధంలో పాల్గొన్న కొందరు ఉగ్రవాదులు తప్పించుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాటాక్లాన్ కాన్సర్ట్ హాల్ వద్ద దాడులు జరిపిన ఉగ్రవాదులు ప్రయాణించిన మరో కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును బెల్జియంలో అద్దెకు తీసుకున్నట్టు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను బెల్జియంలో అరెస్టు చేశారు. మరోవైపు ఫ్రాన్స్ పోలీసులు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.