'మిమ్మల్ని ఏమాత్రం నిశ్చింతగా ఉండనివ్వం'
కైరో: పారిస్‌లో జరిగిన భయానక ఉగ్రవాద దాడులు, సాయుధ కాల్పులకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధికారికంగా ప్రకటించింది. పారిస్‌లోని జాతీయ క్రీడా మైదానం, ఓ సంగీత విభావరి, రెస్టారెంట్లు హోటళ్ల వద్ద జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 128 మంది చనిపోయారు. ఈ ఘటనను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే తమ దేశంపై యుద్ధంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ విదేశీ మీడియా విభాగం అల్ హయత్ మీడియా సెంటర్ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో ఫ్రాన్‌లో దాడులు జరుపాల్సిందిగా అక్కడి ముస్లింలకు పిలుపునిచ్చింది. సిరియాలోని తమ ఫైటర్లపై వైమానిక దాడులు ఆపనంతకాలం ఫ్రాన్స్‌పై దాడులు చేస్తూనే ఉంటామని ప్రకటించింది. 'మీరు మాపై బాంబు దాడులకు పాల్పడుతున్నంతకాలం.. మీరు నిశ్చింతగా ఉండలేరు. మీరు మార్కెట్‌కు వెళ్లాలన్న భయపడే పరిస్థితులు వస్తాయి' అని ఈ వీడియోలో ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. ఇది అయితే తాజా వీడియోనా? లేక పాతదా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది.