కిటికీకి వేలాడి.. ప్రాణాలు నిలుపుకొన్న గర్భిణి!
పారిస్: 'రక్షించండి.. రక్షించండి.. నేను గర్భవతిని'- బాటాక్లాన్ థియేటర్ వద్ద రెండో అంతస్తు కిటికీకి వేలాడుతూ ఓ మహిళ చేసిన ఆర్తనాదం ఇది. అప్పటికే బాటాక్లాన్ థియేటర్ ఉగ్రవాదుల కాల్పులతో దద్దరిల్లుతున్నది. విచక్షణరహితంగా ముష్కరులు కురిపించిన తూటాల వర్షంతో పదులసంఖ్యలో జనం నేలకూలారు. మిగిలినవారు ప్రాణభయంతో ఆర్తనాదాలుచేస్తూ.. తప్పించుకునేందుకు తలోదిక్కు పరుగులు పెట్టారు. ఇలాంటి భయానక సమయంలో థియేటర్ వెనుకద్వారం నుంచి పదులసంఖ్యలో బయటకు పరుగులు తీస్తుండగా.. ఓ మహిళ రెండో అంతస్తు కిటికి అంచులను పట్టుకొని.. సాయం కోసం అర్థించింది.
అత్యంత నాటకీయ, ఉత్కంఠ పరిణామాల మధ్య ఆ గర్భిణి ప్రాణాలను దక్కించుకుంది. ఓ సాహసి అక్కడికి వచ్చి ఆమెను పైకి లాగడంతో బతికి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. థియేటర్‌కు అభిముఖంగా ఉన్న భవనంలో ఉంటున్న జర్నలిస్టు డానియెల్ సెన్నీ ఈ ఘటనను వీడియో తీశారు. అప్పటివరకు సంగీతంతో హోరెత్తిన బాటాక్లాన్ థియేటర్‌లో ఉగ్రవాదులు విచ్చలవిడిగా తెగబడటంతో 80 మంది మృత్యువాతపడ్డారు. ఇంకా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులతో థియేటర్ యుద్ధభూమిగా మారిపోయి రక్తపుచారికలో భీతావహంగా మారిపోయింది. ఆ సమయంలో చాలామంది థియేటర్ నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. ఆ సమయంలో ఈ వీడియో తీసిన జర్నలిస్టు సెన్నీకి కూడా బుల్లెట్ గాయమైంది. వీడయో తీస్తుండగా ఉగ్రవాదుల బుల్లెట్ ఆయన భుజానికి తాకింది.