ఆ డ్యామ్ కూలితే 5 లక్షల మంది జల సమాధి | If this Iraqi dam collapses, half a million people could die | Sakshi
Sakshi News home page

ఆ డ్యామ్ కూలితే 5 లక్షల మంది జల సమాధి

Published Mon, Feb 15 2016 1:27 PM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

ఆ డ్యామ్ కూలితే 5 లక్షల మంది జల సమాధి

ఆ డ్యామ్ కూలితే 5 లక్షల మంది జల సమాధి

బాగ్దాద్: ఇరాక్‌లో టైగ్రిస్ నదిపై నిర్మించిన మోసుల్ డ్యామ్‌కు పెను ముప్పు పొంచి ఉంది. ఎగువ నుంచి వస్తున్న నీటి ఒత్తిడిని తట్టుకోలేక డ్యామ్ ఎప్పుడైనా కూలిపోవచ్చని, ఫలితంగా దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు మృత్యువాత పడే ప్రమాదం ఉందని అమెరికా సైన్యానికి చెందిన ఇంజనీర్ల బృందం ఓ నివేదికలో వెల్లడించింది. డ్యామ్ బద్దలైతే 180 అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహం దిగువకు దూసుకొస్తుందని, 280 మైళ్ల దూరంలోని దేశ రాజధాని బాగ్దాద్ నగరాన్ని కూడా నీట ముంచుతుందని ఇంజనీర్ల బృందం అంచనావేసింది.

డ్యామ్ బద్దలైతే కేవలం నాలుగు గంటలలోపే 30 మైళ్ల దూరంలోని మోసుల్ నగరం 65 అడుగుల నీటిలో మునిగిపోతుందని, ఆ తర్వాత తిక్రీత్ నగరం 50 అడుగుల నీటిలో మునిగి పోతుందని తెలిపింది. ఈ నీటి ప్రవాహం ఉధృతికి 48 గంటల్లోనే దిగువనున్న సమర్రా డ్యామ్ కూడా కూలిపోతుందని, ఫలితంగా బాగ్దాద్ నగరం 13 అడుగుల నీటిలో మునిగిపోతుందని ఇంజనీర్ల బృందం అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ ఇదేనని దశాబ్దం క్రితమే నిపుణులు అంచనావేశారు.

బంక మట్టి, సున్నపురాయి లాంటి జిప్సం ఖనిజ పొరలపైన డ్యామ్ నిర్మించడం వల్లనే డ్యామ్‌కు ముప్పుందన్నది నిపుణుల అభిప్రాయం. అప్పటి నుంచి ప్రమాదం నివారణకు ఇరాక్ ప్రభుత్వం మరమ్మతులు చేపడుతూ వస్తోంది. డ్యామ్ పగుళ్లు, సందుల్లో టన్నుల కొద్ది కంకర, సిమ్మెంట్ మిశ్రమాన్ని కూరుతూ వస్తోంది. ఇంతలో మోసుల్ నగరంతోపాటు, డ్యామ్‌ను కూడా ఐసిస్ టెర్రరిస్టులు ఆక్రమించుకోవడంతో మరమ్మతు పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యానికి చెందిన ఇంజనీర్ల బృందం డ్యామ్‌పై అధ్యయనం చేసి గత నెలలో ఇరాక్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇప్పుడు ఇరాక్ ప్రభుత్వం ఆ నివేదికను పార్లమెంట్ ముందుకు తీసుకరావడంలో భాగంగా ప్రజలకు బహిర్గతం చేసింది.

2014లో ఐసిస్ టెర్రరిస్టులు మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు నగరానికి విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు ప్రభుత్వం డ్యామ్ వద్ద జల విద్యుత్ ఉత్పాదనను నిలిపివేసింది. దాంతో డ్యామ్‌పై మరింత ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. తిరిగి మోసుల్ నగరానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాల్సి వచ్చింది. ఇప్పుడు డ్యామ్ మరమ్మతు పనులు పునరుద్ధరించేందుకు మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే ఉత్తమమైన మార్గమని భావించిన ఇరాక్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. మోసుల్ నగరంపై టెర్రరిస్టులు పట్టుకోల్పోయినట్లయితే ఆక్రోశంతో డ్యామ్‌ను ఉద్దేశపూర్వకంగా ధ్వంసంచేసే ప్రమాదం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

అమెరికాను వ్యతిరేకించే ముస్లిం మత గురువు మొక్తాదా అల్ సదర్ మద్దతుదారుడైన జల వనరుల శాఖ మంత్రి మొహిసిన్ అల్ షమ్మారి మాత్రం అమెరికా ఇంజనీర్ల నివేదికను విశ్వసించడం లేదు. డ్యామ్‌కు వచ్చిన ప్రమాదమేమీ లేదని, ఉంటే వెయ్యిలో ఒక్క శాతం మాత్రమే ఉంటుందని అన్నారు. అమెరికా తమ దేశానికి మరింత మంది సైనికులను పంపించడం కోసమే ఇలాంటి కట్టుకథలు అల్లుతోందని ఆయన ఆరోపించారు.
 
ప్రధాన మంత్రి హైదర్ అల్ అబాది మాత్రం మరమ్మతు పనులను తక్షణమే చేపట్టాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా డ్యామ్ మరమ్మతు పనులను ఇటలీ కంపెనీ ట్రెవీకి 1900 కోట్ల రూపాయలకు అప్పగించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement